వినాయక చవితికి పర్యావరణహిత బాట.. మట్టి వినాయకులపై సుజాత విద్యానికేతన్ అవగాహన!
1000 కరపత్రాల పంపిణీ.. మట్టి గణపతులనే పూజిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
హసన్‌పర్తి, రీపోటర్ ప్రణయ్ గొర్రె,సెప్టెంబర్ 10:
వినాయక చవితి పండుగను పర్యావరణహితంగా నిర్వహించాలనే సంకల్పంతో హసన్‌పర్తి 66వ డివిజన్ కేంద్రంలోని సుజాత విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతారామ్ కర్ణ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఆవశ్యకతను వివరిస్తూ 1000 కరపత్రాలను ఆవిష్కరించి ప్రజలకు పంపిణీ చేశారు.

30 ఏళ్లుగా పర్యావరణహిత కార్యక్రమాలు
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శాంతారామ్ కర్ణ మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా పాఠశాల పర్యావరణ మిత్ర యూనిట్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వినాయక చవితిని ప్రకృతికి హాని కలగకుండా సంప్రదాయబద్ధంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై, చేపలు, క్రిమికీటకాలు తదితర జలచరాలకు తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. కలుషితమైన నీటిని పశుపక్షాదులు తాగడం వల్ల వాటి ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ప్రతి ఏటా 1500 మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం విద్యార్థుల చేత సుమారు 1500 మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేస్తున్నామని శాంతారామ్ కర్ణ తెలిపారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా పండుగను ఆనందంగా జరుపుకోవచ్చని చెప్పారు.
ఈ పర్యావరణహిత కార్యక్రమాలకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఆరుసార్లు పర్యావరణ మిత్ర అవార్డులు అందుకున్నామని తెలిపారు.
విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై అవగాహన
ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం మానవ జీవితానికే కాకుండా భూమిపై నివసించే సకల ప్రాణులకు ప్రమాదకరంగా మారుతోందని ఆయన అన్నారు. అందుకే విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
భవిష్యత్తులో ధరిత్రి దినోత్సవం, వనమహోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, కాలుష్య రహిత దీపావళి, పర్యావరణహిత హోలీ తదితర కార్యక్రమాలను పాఠశాలలో కొనసాగిస్తామని చెప్పారు.
“మట్టి వినాయకుడిని పూజిద్దాం – పర్యావరణాన్ని రక్షిద్దాం” అనే నినాదంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు 1000 కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గూడూరు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు పాల్గొన్నారు.
“పర్యావరణ పరిరక్షణలో మీ వంతు సహకారం అందించండి”

