📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

  • మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి*
    .అటవీ ఉత్పత్తులతో స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెంపొందించాలి.
    .పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.

    *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-

    మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని, స్థానికంగా లభించే అటవీ ఉత్పత్తులను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు.
    గురువారం ఏటూరు నాగారం మండల కేంద్రంలో ట్రెజరీ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన దుస్తుల తయారీ, జూట్ బ్యాగుల తయారీ యూనిట్లను ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి మంత్రి ప్రారంభించారు.
    ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ మహిళలు సొంత కాళ్లపై నిలబడేలా ప్రోత్సహించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళా సంఘాలకు బ్యాంకుల అనుసంధానంతో వడ్డీ లేని రుణాలు అందిస్తూ స్వయం ఉపాధికి తోడ్పాటు అందిస్తున్నామన్నారు. మహిళలు కుట్టు నైపుణ్యాలను నేర్చుకొని సొంతంగా యూనిట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆదాయం పొందడంతోపాటు మరికొందరికి ఉపాధి కల్పించవచ్చని పేర్కొన్నారు.
    మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు రూ.10 లక్షలతో ఆధునిక యంత్రాలను సమకూర్చినట్లు తెలిపారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన, ఆదివాసీ మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాల ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అవసరాలకు ఉపయోగపడే వస్తువులను తయారు చేయడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు.
    ములుగు నియోజకవర్గంలో ప్రైవేటు సంస్థల సహకారంతో సుమారు 2,000 మందికి శిక్షణ అందించినట్లు మంత్రి తెలిపారు. శిక్షణ పొందిన మహిళలకు మహిళా సంఘాలు, గ్రామీణాభివృద్ధి శాఖ, ఐటీడీఏ ద్వారా కుట్టు యంత్రాలు అందించే అంశంపై కృషి చేస్తున్నామన్నారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా నియోజకవర్గానికి 1,000 కుట్టు యంత్రాలు అందిస్తామని పేర్కొన్నారు. కుట్టు శిక్షణ పూర్తిచేసిన వారి జాబితాలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గిరిజన మహిళలకు ఐటీడీఏ ద్వారా ఉచితంగా కుట్టు యంత్రాలు అందించేందుకు ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలిపారు.
    శిక్షణ పూర్తయిన తర్వాత మహిళలు తమ ఇళ్ల వద్దనే కుట్టు యంత్రాలను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందేలా ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. పాఠశాలలు, వసతిగృహాల విద్యార్థులతోపాటు అంగన్‌వాడీ పిల్లల ఏకరూప దుస్తుల కుట్టు పనులను మహిళలకు అందించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామన్నారు. ఏకరూప దుస్తుల కుట్టు చార్జీలను పెంచాలన్న అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఇటువంటి శిక్షణ, తయారీ కేంద్రాలను మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
    అటవీ ప్రాంతాల్లో లభించే ఇప్పపువ్వు, తేనె, విస్తరాకుల తయారీకి ఉపయోగపడే ఆకులతో ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలని మంత్రి సూచించారు. ఇప్పపువ్వుతో లడ్డూల తయారీ వంటి కార్యక్రమాలు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. గోనెపల్లిలో తేనె ఉత్పత్తికి సంబంధించిన శిక్షణ అందిస్తున్నారని తెలిపారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానిక వనరులతో సొంత గ్రామాల్లోనే వ్యాపారాలు నిర్వహించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
    ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో భోజనాలకు విస్తరాకులను వినియోగించాలని మంత్రి సూచించారు. మేడారం జాతర సందర్భంగా మంత్రులు, సిబ్బంది, పోలీసులతోపాటు వేలాది మందికి భోజనాలు అందించేందుకు కామారం నుంచి సేకరించిన ఆకులను ఉపయోగించినట్లు గుర్తుచేశారు. ఆకులు లభించే చెట్లను, తేనె ఉత్పత్తికి దోహదపడే అటవీ వనరులను సంరక్షించుకోవాలని సూచించారు.
    జిల్లాలో ఏయే ప్రాంతాల్లో ఎటువంటి అటవీ ఉత్పత్తులు లభిస్తున్నాయి, వాటితో ఎలాంటి వస్తువులు తయారు చేయవచ్చనే అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇద్దరు లేదా ముగ్గురు యువతకు అధ్యయన బాధ్యతలు అప్పగించి, స్థానిక వనరుల ఆధారంగా ఉపాధి అవకాశాలను గుర్తించాలని సూచించారు. మహిళలకు నైపుణ్య శిక్షణ అందిస్తున్న నిర్వాహకులను మంత్రి అభినందించారు.
    అనంతరం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి మంత్రి అనసూయ సీతక్క పదిమంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను, ఏటూరు నాగారం మండల పరిధిలోని 1,219 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో తొలిసారిగా ఎంపిక చేసిన 11 ఉత్తమ పాఠశాలలకు సంబంధించిన అవార్డులను ఆయా ప్రధానోపాధ్యాయులకు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.