స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ
ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హసన్‌పర్తి, సెప్టెంబర్ 1:
రాష్ట్రంలో ప్రతి అర్హ కుటుంబానికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు.
మంగళవారం హసన్‌పర్తి ఎర్రగట్టుగుట్టలోని ఎంఎస్‌ఆర్ గార్డెన్‌లో 65, 66, 1, 2, 55 డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు ఎంపీ కడియం కావ్యతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గుడిసెలు లేని గ్రామాలు, పేదలందరికీ సొంత ఇళ్లు ఉండాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే వ్యక్తులను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఎమ్మెల్యే నాగరాజు సూచించారు. ప్రతి అర్హుడికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు అందించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో 65వ డివిజన్ అధ్యక్షుడు నేదునూరి సునీల్, 66వ డివిజన్ అధ్యక్షుడు గొర్రె కిరణ్, 1వ డివిజన్ అధ్యక్షుడు చిర్ర రాము, 2వ డివిజన్ అధ్యక్షుడు పుట్ట తిరుపతి, 55వ డివిజన్ అధ్యక్షుడు గడ్డం అరుణ్, హనుమకొండ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పింగిలి వెంకటరెడ్డి, ఆత్మకూరు మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి, డీసీసీ జనరల్ సెక్రెటరీ, మాజీ కార్పొరేటర్ బానోతు కల్పన, వంగపహాడ్ పీఏసీఎస్ చైర్మన్ రాజేష్ గౌడ్, మండల అధ్యక్షుడు అశోక్ కుమార్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాకేష్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు పూలక్క, ఉపాధ్యక్షురాలు అనూష, స్వాతి, 2వ డివిజన్ మాజీ అధ్యక్షుడు పొన్నాల రఘు, సీనియర్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు

