కిరాణా వర్తకుల సంఘంతో పోలీ
సుల సమావేశం
గుడుంబా తయారీదారులకు వర్తకులు సహకరిస్తే ఉపేక్షించబోమని తొర్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గణేష్, ఎస్సై మహేందర్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం
తొర్రూరులో కిరాణా వర్తకుల సంఘం సభ్యులతో తొర్రూరు సీఐ గణేష్, ఎస్సై మహేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం సరఫరా తగ్గుతున్న నేపథ్యంలో గుడుంబా తయారీదారులు ప్రస్తుతం చక్కెర వైపు దృష్టి సారించే అవకాశం ఉందని తెలిపారు.
గుడుంబా తయారీదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కెర లేదా ఇతర ముడి పదార్థాలను విక్రయించి సహకరించవద్దని వర్తకులను హెచ్చరించారు. నిషేధిత గుడుంబా తయారీకి అవసరమైన పదార్థాలను విక్రయించినట్లు గుర్తిస్తే, సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ గణేష్, ఎస్సై మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గుడుంబా నిర్మూలనకు పోలీసులకు సహకరించాలని వర్తకులను కోరారు. ఈ సమావేశంలో స్థానిక వర్తక సంఘం నాయకులు పాల్గొన్నారు.

