📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguలక్ష్మీదేవిపేటలో యువతకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు

లక్ష్మీదేవిపేటలో యువతకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

లక్ష్మీదేవిపేటలో యువతకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు
మద్యం, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి – వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు హెచ్చరిక
వెంకటాపూర్, జూలై 24 (ప్రజావాణి): మద్యం, గంజాయి, నార్కోటిక్ మత్తు పదార్థాల బారిన పడుతున్న యువతను సన్మార్గంలో నడిపించేందుకు వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపేట గ్రామపంచాయతీ ఆవరణంలో శుక్రవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు మాట్లాడుతూ యువత మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తుంటే కొంతమంది యువకులు చెడు స్నేహాల ప్రభావంతో మత్తు వ్యసనాలకు అలవాటుపడి చదువుకు దూరమవుతున్నారని పేర్కొన్నారు.
ఇటీవల మద్యం మత్తులో ఓ వ్యక్తి తన తల్లిదండ్రులపై దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీసిన ఘటనను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, మత్తు మనిషి ఆలోచనా శక్తిని పూర్తిగా కోల్పోయేలా చేస్తుందని చెప్పారు. యువత తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.
అక్రమంగా మద్యం విక్రయించే బెల్టు షాపులు, నార్కోటిక్ పదార్థాల విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గ్రామంలో ఎక్కడైనా మత్తు పదార్థాల వినియోగం లేదా అక్రమ విక్రయం కనిపిస్తే వెంటనే 100 నంబర్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నాయని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేయొద్దని యువతకు సూచించారు.
సదస్సు ముగింపులో యువతతో కలిసి “మద్యం, డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉంటాం.. మా పిల్లలను మంచి మార్గంలో నడిపిస్తాం” అంటూ ప్రతిజ్ఞ చేయించారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని ఎస్సై చల్ల రాజు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపేట గ్రామ సర్పంచ్ బొమ్మకంటి వంశావతి రమేష్, ఉపసర్పంచ్ కొండ తిరుపతి, బీజేపీ నాయకుడు కారుపోతుల యాదగిరి, కడవెండి తిరుపతి, గ్రామ పెద్దలు, యువకులు, వారి తల్లిదండ్రులు, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.