*వేధింపులు సహించవద్దు..షీ టీమ్స్ ను ఆశ్రయించండి*
* *మన ప్రజావాణి* మందమర్రి:- జులై 7
మహిళలు, బాలికలు సమాజంలో ఎదురయ్యే వేధింపులను సహించకుండా, షీ టీమ్స్ ను ఆశ్రయించాలని జిల్లా షీ టీం సిబ్బంది సూచించారు. పట్టణంలోని పిఎంశ్రీ ప్రభుత్వ ఆదర్శ (మోడల్) ఉన్నత పాఠశాలలో మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పర్యవేక్షణలో, జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ హైమ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా షీ టీమ్ సిబ్బంది మహిళల కోసం అమలు చేస్తున్న భద్రతా చర్యలు, ఈవ్‌టీజింగ్,సైబర్ నేరాలు,మానవ అక్రమరవాణా,ట్రాఫిక్ నియమాలు,టి-సేఫ్ యాప్ మరియు షీ టీమ్స్ సేవల గురించి సమగ్రంగా వివరించారు.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచిస్తూ,హెల్ప్‌లైన్ నెంబర్లు డయల్ 100, రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల జిల్లా షీ టీమ్ నంబర్ 8712659385 లకు సమాచారం అందించాలని తెలియజేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మహిళలు ఎటువంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు శ్రవణ్,శ్రీలత, పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్నీమ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.



