పానీపూరి.. నిన్న బల్లి.. నేడు పల్లీల్లో పురుగు..!
జిల్లాలో ఆహార భద్రతపై ప్రశ్నలు.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఎక్కడ..?
తంగళ్లపల్లి, ప్రజావాణి జూలై 2: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరుసగా వెలుగులోకి వస్తున్న ఆహార భద్రతకు సంబంధించిన ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల పానీపూరి తిని పలువురు చిన్నారులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన మరువకముందే, సిరిసిల్ల పట్టణంలోని ఓ బొంది కారంలో బల్లి కనిపించడం కలకలం రేపింది. తాజాగా తంగళ్లపల్లి మండలంలోని జై శ్రీరామ్ వైన్స్ పర్మిట్ రూమ్లో విక్రయించిన పల్లీల్లో పురుగు కనిపించడం మరోసారి అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.పర్మిట్ రూమ్‌లో పల్లీలు కొనుగోలు చేసిన ఓ కస్టమర్ వాటిని తింటుండగా పురుగు కనిపించడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. దీంతో అక్కడే ఉన్న ఇతర కస్టమర్లతో కలిసి యజమానులను నిలదీశారు. ఈ ఘటనతో పర్మిట్ రూమ్‌లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.జిల్లాలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సమర్థవంతంగా తనిఖీలు నిర్వహించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఆరోగ్య భద్రత విషయంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ప్రజల డిమాండ్ ఇదే..
ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. “తనిఖీలు ఎక్కడ..? బాధ్యులపై చర్యలు ఎక్కడ..?” అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై జిల్లాలోని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు, వైన్స్ పర్మిట్ రూములు తదితర చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు. లేదంటే భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



