📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కొప్పలకొండలో 'కార్పొరేట్' మట్టి దోపిడీ: నిమ్మకు నీరెత్తినట్లు రెవెన్యూ యంత్రాంగం!

కొప్పలకొండలో ‘కార్పొరేట్’ మట్టి దోపిడీ: నిమ్మకు నీరెత్తినట్లు రెవెన్యూ యంత్రాంగం!

📰 Generate e-Paper Clip

అనంతపురం జిల్లా జూన్ 26 ప్రజావాణి గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామం వేదికగా ప్రభుత్వ భూములు,సహజ వనరుల కొల్లగొట్టే పర్వం యథేచ్ఛగా సాగుతోంది.ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యం,కొందరు స్థానిక అక్రమార్కులతో చేతులు కలిపి పగలు,రాత్రి తేడా లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తూ కోట్లు గడిస్తోంది. జేసీబీలు,పొక్లెయిన్లతో కొండలను,గుట్టలను తవ్వేస్తూ,ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నా. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం “నిమ్మకు నీరెత్తినట్లు” వ్యవహరించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
పచ్చని కొండలను గుల్ల చేస్తున్న మాఫియా
కార్పొరేట్ హాస్పిటల్ ముసుగులో సాగుతున్న ఈ అక్రమ మైనింగ్ దందా కొప్పలకొండ గ్రామ పరిసరాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. మైనింగ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు (పర్మిషన్లు) తీసుకోకుండా, నిబంధనలను తుంగలో తొక్కి భారీ ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు.పర్యావరణానికి తీవ్ర నష్టం చేకూరుస్తూ,సహజ వనరులను దోచుకుంటున్న ఈ వ్యవహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల మౌనం.. మామూళ్ల మత్తు?
ఇంత బహిరంగంగా జేసీబీలతో తవ్వకాలు జరిపి,పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నా,కంటికి కనిపిస్తున్న సత్యంపై రెవెన్యూ శాఖ అధికారులు కళ్ళు మూసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమార్కులు విసురుతున్న నోట్ల కట్టల మత్తులో అధికారులు జోగుతున్నారా? లేక కార్పొరేట్ శక్తుల నుంచి వస్తున్న రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మిన్నకుండిపోయారా? అని గ్రామస్థులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.జిల్లా కలెక్టర్ అక్రమ మైనింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఉన్న తహశీల్దార్,ఆర్ఐ,విఆర్ఓలు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద హస్తమే ఉన్నట్లు తెలుస్తోంది.
తక్షణమే స్పందించకుంటే ఆందోళనలు తప్పవు
కార్పొరేట్ శక్తుల ధనదాహానికి కొప్పలకొండలో భూగర్భ జలాలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు,మైనింగ్ మరియు రెవెన్యూ శాఖల స్పందించి,తక్షణమే కొప్పలకొండ గ్రామంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయాలి.అక్రమ రవాణాకు వాడుతున్న జేసీబీలను,ట్రాక్టర్లను సీజ్ చేసి,బాధ్యులైన కార్పొరేట్ ఆసుపత్రి నిర్వాహకులపై మరియు వారికి సహకరిస్తున్న అధికారులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానిక ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.లేనిపక్షంలో రెవెన్యూ కార్యాలయం ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.