📄 ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల  ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న పెట్రోల్ బంకులు: నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు!

పోరుమామిళ్ల  ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న పెట్రోల్ బంకులు: నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు!

📰 Generate e-Paper Clip

కడప జిల్లా (ప్రజావాణి జూన్ 17) పోరుమామిళ్ల పట్టణంలోని ఉన్న భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL),మరియు ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు కల్పించాల్సిన కనీస ప్రాథమిక వసతులు పూర్తిగా మృగ్యమయ్యాయి. లీటర్ల కొద్దీ పెట్రోల్,డీజిల్ అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్న బంకుల యాజమాన్యాలు, ప్రజలకు ఉచితంగా అందించాల్సిన కనీస సేవలను గాలికొదిలేశాయి.దీనిపై స్థానిక అధికారులు కంటితుడుపు చర్యలు కూడా తీసుకోకపోవడం,వారి నిర్లక్ష్య వైఖరికి మరియు లాలూచీతనానికి అద్దం పడుతోంది.
నిబంధనలు కాగితాలకే పరిమితం! బంకుల్లో కనిపించని కనీస సదుపాయాలు
ఆయిల్ కంపెనీల నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ బంకులో వినియోగదారుల కోసం కొన్ని తప్పనిసరి సేవలు ఉచితంగా అందించాలి. కానీ పోరుమామిళ్లలోని బంకుల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది:

* గాలి నింపే సౌకర్యం లేదు ! వాహనదారులకు ఉచితంగా టైర్లలో గాలి నింపే యంత్రాలు పనిచేయడం లేదు. ఉన్నా కూడా ‘రిపేర్’ బోర్డులు పెట్టి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
తాగునీటి కొరత! ఎండ తీవ్రతకు అల్లాడిపోయే ప్రయాణికులకు కనీసం తాగడానికి గుక్కెడు మంచి నీరు కూడా ఇక్కడ లభించడం లేదు. వాటర్ ప్లాంట్లు కేవలం ప్రదర్శన వస్తువులుగా మారాయి.
* నిరుపయోగంగా టాయిలెట్లు! మహిళా ప్రయాణికులు, వృద్ధులు అత్యవసరంగా వాడుకోవడానికి టాయిలెట్ సౌకర్యం లేదు. ఉన్న కొన్ని చోట్ల తాళాలు వేసి ఉంచడమో, లేదా అత్యంత అధ్వాన్నంగా, దుర్వాసనతో నిండి ఉండడమో జరుగుతోంది.

క్వాలిటీ టెస్టింగ్ పేపర్లు ఎక్కడ? ప్రతీ బంకులోనూ మోసం!
ప్రతి వినియోగదారుడికి తాను కొనుగోలు చేసే ఇంధనం యొక్క నాణ్యతను పరీక్షించే హక్కు ఉంది. ఇందుకు గాను ప్రతి పెట్రోల్ బంకులో ఫిల్టర్ పేపర్ అందుబాటులో ఉంచాలి. వినియోగదారుడు అడిగిన వెంటనే ఇంధన నాణ్యతను పరీక్షించి చూపించాల్సింది పోయి, పోరుమామిళ్ల బంకుల్లో అసలు టెస్టింగ్ పేపర్లే లేకపోవడం గమనార్హం.

* ఇది కచ్చితంగా వినియోగదారులను మోసం చేయడమే.!
* నాణ్యత లేని, కల్తీ ఇంధనాన్ని విక్రయిస్తున్నారనే అనుమానాలకు ఈ చర్యలు బలం చేకూరుస్తున్నాయి.!
* ప్రశ్నించిన వినియోగదారులపై బంక్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం ఇక్కడి అరాచకత్వానికి నిదర్శనం!.

నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు.. చర్యలు శూన్యం!
ఈ దారుణాలపై స్థానిక పౌరసరఫరాల శాఖ లీగల్ మెట్రాలజీ అధికారులు ఎందుకు స్పందించడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

1.తనిఖీల ఊసే లేదు!: నెలవారీ తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు బంకుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
2. మామూళ్ల మత్తు! బంక్ యాజమాన్యాల నుంచి అందుతున్న’మామూళ్ల’ మత్తులో అధికారులు జోగుతున్నారనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.
3.  ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా,రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటి? పోరుమామిళ్ల పరిధిలోని పెట్రోల్ బంకుల దోపిడీకి, నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి,పోరుమామిళ్లలోని భారత్,హెచ్పి, ఇండియన్ ఆయిల్ బంకులపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ద్వారా దాడులు నిర్వహించాలి.నిబంధనలు పాటించని బంకుల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు,విధి నిర్వహణలో విఫలమైన స్థానిక అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి అధికారులు, యాజమాన్యాలు గురికాక తప్పదు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular