
పోరుమామిళ్ల,జూన్2 ప్రజావాణి విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటునందించే లక్ష్యంతో మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న MTF స్కాలర్‌షిప్ ప్రోగ్రాం పోస్టర్‌ను ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన అనాధలు మరియు తండ్రిని కోల్పోయిన విద్యార్థులకు విద్యా పరంగా అండగా నిలవడం అభినందనీయమైన సేవ అని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు.మదర్ థెరెసా ఫౌండేషన్ చైర్మన్ చిత్తా రవి ప్రకాశ్ రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ చిత్తాగిరి ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు పోరుమామిళ్లలోని చిత్తా గ్రాండ్ ఫోర్ట్ కళ్యాణమండపంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో 200 మంది అర్హులైన అనాధ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1,000 నగదు స్కాలర్‌షిప్‌తో పాటు విద్యా సామగ్రితో కూడిన విద్యా కిట్లను అందజేయనున్నట్లు వెల్లడించారు.విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు సేవలు అందించే లక్ష్యంతో మదర్ తెరెసా ఫౌండేషన్ విద్యా, వైద్య మరియు సామాజిక సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జెడ్పిటిసి ముత్యాల ప్రసాద్, సురేష్, రుద్రవరం ప్రసాద్, కొండయ్య, మాఫిర్, ఎంపీపీ సి. భాష, దూల రఘునాథరెడ్డి, బాలుడు, కేపీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ సభ్యులు, సామాజిక కార్యకర్తలు మరియు పలువురు ప్రముఖులు పాల్గొని కార్యక్రమ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.




