మృతి పట్ల, ఓ వ్యక్తిపై తండ్రి అనుమానం !
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, బుగ్గారం మే 28 (ప్రజావాణి):
బుగ్గారం మండల పరిధిలోని చిన్నాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి 11 సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన గురువారం రోజున బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. అయితే బాలుడి మరణంపై ఓ వ్యక్తిపై అనుమానం ఉందంటూ మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై జి సతీష్, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… చిన్నాపూర్ గ్రామానికి చెందిన ఒర్సు శ్రీనివాస్ వృత్తిరీత్యా గొర్రెల కాపరి. గురువారం రోజున ఆయన తన చిన్న కుమారుడైన ఒర్సు శివకుమార్ (11) ను గొర్రెల సంరక్షణ కోసం అదే గ్రామానికి చెందిన పరుమాల మహేష్ అనే వ్యక్తి వద్ద ఉంచి, మధ్యాహ్నం సమయంలో ఇంటికి వెళ్లాడు. అనంతరం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో మహేష్, శ్రీనివాస్‌కు ఫోన్ చేసి బాలుడు కనిపించడం లేదని, వెంటనే రావాలని సమాచారం ఇచ్చాడు. కంగారుగా అక్కడికి చేరుకున్న శ్రీనివాస్‌కు చిన్నాపూర్ గ్రామ శివారులోని అంతడుపుల రామలింగయ్యకు చెందిన వ్యవసాయ బావి వద్ద బాలుడి చెప్పులు కనిపించాయి. దీంతో మృతుడి తండ్రి మహేష్, గ్రామస్థులు కలిసి బావిలో వెతకగా ఒర్సు ప్రభాకర్ అనే వ్యక్తి బాలుడిని బావిలో నుండి బయటకు తీశాడు. అప్పటికే బాలుడు మృతి చెంది ఉన్నాడు. పరుమాల మహేష్ తెలిపిన వివరాల ప్రకారం… బాలుడు బాత్రూం కి వెళ్తానని చెప్పి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మునిగిపోయినట్లు చెప్పాడు. అయితే తన కుమారుడి మరణంపై పరుమాల మహేష్‌పై తనకు గట్టి అనుమానం ఉందని బాలుడి తండ్రి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుగ్గారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించినట్లు బుగ్గారం మండల ఎస్సై జి సతీష్ వెల్లడిం చారు.



