50 శాతం సబ్సిడీపై విత్తనాల పంపిణీ
రైతులకువిత్తనాలు అందజేసిన ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి
మన ప్రజావాణి ప్రతినిధి చిగురుమామిడి:చిగురుమామిడి మండల రైతులు జీలుగు సాగు చేపట్టడం ద్వారా భూసారం పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, చిగురుమామిడి సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి తెలిపారు.కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి రైతు వేదికలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై అందజేస్తున్న పచ్చిరొట్ట, జీలుగు విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, గ్రామ సర్పంచ్ జంగా శిరీష రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూసారం పెంపునకు జీలుగు పంట ఎంతో ఉపయోగకరమని తెలిపారు. జీలుగు సాగు వల్ల భూమిలోని పోషకాలు పెరిగి తదుపరి పంటలకు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందని రైతులకు వివరించారు. రైతులు తప్పనిసరిగా ఈ పంటను సాగు చేసి ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మండల వ్యవసాయ అధికారి తాటిపల్లి పున్నం చందర్ రెడ్డి మాట్లాడుతూ చిగురుమామిడి మండలానికి 330 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు, 50 క్వింటాళ్ల జనుము విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 30 కిలోల జీలుగు విత్తనాల బస్తాను 2.20 ఎకరాల్లో చల్లుకోవాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మెడబోయిన రాజు, ఏఈవోలు అంజలి, అఖిల, రైతులు తదితరులు పాల్గొన్నారు



