📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamఉపాధి హామీ పనుల్లో ఘోర నిర్లక్ష్యం

ఉపాధి హామీ పనుల్లో ఘోర నిర్లక్ష్యం

📰 Generate e-Paper Clip

ప్రజావాణి, తిరుమలాయపాలెం :

తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో శనివారం నిర్వహించిన ఉపాధి హామీ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమైంది. గ్రామ పరిధిలో చేపడుతున్న కాలువల మరమ్మత్తు పనుల సమయంలో కూలీలు విచక్షణారహితంగా ఈత చెట్లకు నిప్పు పెట్టి కాల్చివేస్తుండటం స్థానిక గీత కార్మికుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.గ్రామంలో ఉపాధి హామీ పనుల పేరుతో జరుగుతున్న ఈ చర్యల వల్ల గీత కార్మికుల జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటోందని వారు వాపోతున్నారు. ఈత చెట్లు గీత కార్మికులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండగా, వాటిని కూలీలు కాల్చివేయడం వల్ల భవిష్యత్తులో కుటుంబాలను పోషించడం కష్టసాధ్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు దగ్గరుండి పర్యవేక్షణ చేయాల్సి ఉన్నప్పటికీ వారు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించి కూలీలకు అవగాహన కల్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని స్థానికులు అంటున్నారు.ఉపాధి హామీ పనుల సమయంలో ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, వారి నిర్లక్ష్యం కారణంగా కూలీలు ఇష్టారీతిన వ్యవహరిస్తూ చెట్లను తగులబెడుతున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఈ ఘటనతో గీత కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. ఒకవైపు ఇప్పటికే ఉపాధి అవకాశాలు తగ్గిపోతుండగా, మరోవైపు జీవనాధారమైన ఈత చెట్లు నాశనం కావడంతో తమ పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని వారు చెబుతున్నారు.గ్రామంలో జరుగుతున్న ఈ చర్యలను వెంటనే అడ్డుకోవాలని, చెట్లను ధ్వంసం చేస్తున్న కూలీలపై చర్యలు తీసుకోవాలని గీత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన పంచాయతీ కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లపై ఉన్నతాధికారులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం చేపడుతున్న ఉపాధి హామీ పనులు స్థానిక ప్రజలకు మేలు చేయాల్సిందిపోయి, గీత కార్మికుల జీవనోపాధికి ముప్పుగా మారడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి పనుల నిర్వహణలో పర్యవేక్షణ పెంచి, ప్రకృతి సంపదను రక్షించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular