📄 ePaper
Friday, May 15, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriనీట్-2026 పేపర్ లీకేజీపై ఏఐవైఎఫ్ ఆందోళన - కేంద్ర విద్యాశాఖ మంత్రి...

నీట్-2026 పేపర్ లీకేజీపై ఏఐవైఎఫ్ ఆందోళన – కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, మే 13 (ప్రజావాణి): నీట్-2026 పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ అంబేద్కర్ కూడలి వద్ద బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ, మే 3న నిర్వహించిన నీట్-2026 పరీక్షలో పేపర్ లీకేజీ, భారీ అక్రమాలు వెలుగులోకి రావడం దేశ విద్యా వ్యవస్థకు మచ్చ తెచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాసిన నేపథ్యంలో ఈ ఘటన లక్షలాది కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు.

“పారదర్శకత”, “డిజిటల్ ఇండియా”, “అమృత కాలం” అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు కనీస భద్రతతో పరీక్ష కూడా నిర్వహించలేకపోయిందని విమర్శించారు. 2024లో జరిగిన నీట్ పేపర్ లీక్ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు మరింత పెద్ద స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.

పరీక్షల నిర్వహణను కోచింగ్ మాఫియా, అవినీతి వలయాలకు అప్పగించిన ఫలితమే ఈ పరిస్థితి అని పేర్కొన్నారు. పరీక్ష రద్దుతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు కోచింగ్, హాస్టల్, ప్రయాణ ఖర్చులతో ఆర్థికంగా నష్టపోయాయని తెలిపారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే అవినీతికి పాల్పడిన అధికారులను అరెస్ట్ చేసి, విద్యార్థులకు అదనపు ఫీజులు లేకుండా పూర్తి భద్రతతో మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరారు.

దేశ యువత భవిష్యత్తుతో ఆటలాడే ప్రభుత్వాలను చరిత్ర క్షమించదని హెచ్చరిస్తూ, విద్యను వ్యాపారంగా మార్చిన విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి–యువజన ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్, వికాస్, మురళి, నాయకులు రవళి, కిరణ్మయి, దీప్తి, కుమార్, నదీమ్, మురళీకృష్ణ, పరమేష్, ప్రదీప్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular