బెజ్జంకి, మే 10(ప్రజావాణి
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలపరిధిలోని బేగంపేట గ్రామంలో గల పాత హనుమాన్ దేవాలయాన్ని హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హనుమాన్ మాలధారణ స్వాములు సంయుక్తంగా తమ సొంత ఖర్చులతో సుందరీకరించారు.ఆలయ పరిసరాలను శుభ్రపరిచి ప్రత్యేక అలంకరణలు చేపట్టారు.ఈ సందర్భంగా హనుమాన్ ఆలయ సేవకులు నార్ల బాలచంద్రం మాట్లాడుతూ, గ్రామ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటారని తెలిపారు. ఆలయంలోని హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కాకతీయులు, శాతవాహనుల కాలంలో జరిగినట్లు గ్రామ పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నారని పేర్కొన్నారు.ప్రతి ఏడాది శ్రావణమాసంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆలయాన్ని దర్శించుకుంటారని, హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా హనుమాన్ మాలధారణ స్వాములు ఆలయ అభివృద్ధికి విశేషంగా సహకరిస్తున్నారని తెలిపారు. ఆలయ సేవలో పాల్గొంటున్న స్వాములకు, వారి కుటుంబాలకు హనుమాన్ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆకాంక్షించారు.

