బెజ్జంకి, మే 7 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ అకాల వర్షం కురవడంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.వర్షానికి తోడు బలమైన ఈదురు గాలులు వీయడంతో ధాన్యం ఉప్పలపై కప్పిన టార్పాలిన్ కవర్లు ఎగిరిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడం, మిల్లులకు తరలించడం ఆలస్యంగా జరుగుతుండటంతో వర్షం పడిన ప్రతిసారీ నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే తడిసి ముద్దవుతుండటంతో తమ బాధ చెప్పుకోలేని పరిస్థితి నెలకొందని పలువురు రైతులు వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, అకాల వర్షానికి తడిసిన ప్రతి ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

