66వ డివిజన్లో కోతుల స్వైరవిహారం.. ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
ఇళ్లలోకి చొరబడి విధ్వంసం.. చిన్నారులు, వృద్ధుల్లో భయాందోళన – అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం!
హసన్పర్తి, (మన ప్రజావాణి):
హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధిలోని హసన్పర్తి 66వ డివిజన్లో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. కోతుల గుంపులు కాలనీల్లో స్వైరవిహారం చేస్తూ ఇళ్లలోకి చొరబడి నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు నిత్యం భయాందోళన మధ్య జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. కోతుల సమస్యతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇళ్లలోకి చొరబడి వస్తువుల ధ్వంసం
డివిజన్లోని పలు కాలనీల్లో కోతులు గుంపులుగా సంచరిస్తూ ఇళ్ల పైకప్పులపై, రహదారులపై హల్చల్ చేస్తున్నాయి. ఇళ్లలోకి ప్రవేశించి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడమే కాకుండా, ఇంట్లోని వస్తువులను చిందరవందర చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు రహదారులపైకి రావాలంటేనే భయపడుతున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లే సమయంలో కోతులు దాడి చేస్తాయేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు!
కోతుల బెడదపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రతకు సంబంధించిన సమస్యను అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నా శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం జరిగాక స్పందిస్తారా?
ఇప్పటికైనా జీడబ్ల్యూఎంసీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ప్రత్యేక కోతుల నియంత్రణ బృందాలను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కోతులను సురక్షితంగా పట్టుకుని జనావాసాలకు దూరంగా తరలించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత హడావుడి చేయడం కాకుండా, ముందుగానే ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకోవాలని 66వ డివిజన్ ప్రజలు అధికారులను కోరుతున్నారు



