*తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా తాటికాయల స్వామి ఏకగ్రీవ ఎన్నిక*
*ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందజేత*
మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా బాసరగాడి గ్రామానికి చెందిన తాటికాయల స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాజీ కార్మిక శాఖ మంత్రి, మేడ్చల్ స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా తాటికాయల స్వామికి నియామక పత్రం అందజేశారు.
అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బక్క నరేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తాటికాయల స్వామికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రం అందించారు. జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన స్వామిని పలువురు నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సంఘాన్ని జిల్లా స్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల సాధన కోసం సంఘం చేపట్టే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనిగిరి వెంకటేశం, రాష్ట్ర ఇన్‌చార్జి టి. సత్యనారాయణ, బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి బేత్రి విజయ్ కుమార్, మేడ్చల్ కోఆర్డినేటర్ గడ్డం వెంకటేష్, బాసరగాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు తాటికాయల స్వామికి అభినందనలు తెలియజేస్తూ సంఘం అభివృద్ధికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

