అడవి జంతువుల వేటకు అమర్చిన విద్యుత్ తీగలకు బలై భర్త మృతి
భర్త మృతిపై అనుమానాలు.. బాధ్యులపై విచారణ జరపాలని భార్య ఫిర్యాదు
దండేపల్లి (ప్రజావాణి): నవంబర్ 11
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పాత మామిడిపల్లి గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగల ఉచ్చుకు తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అడవి జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలే తన భర్త మృతికి కారణమయ్యాయని మృతుడి భార్య బోయిని సరిత ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు వివరాల ప్రకారం.. పాత మామిడిపల్లి గ్రామానికి చెందిన బోయిని రెడ్డి (40) ప్రతిరోజూ మాదిరిగానే 387 అటవీ కంపార్ట్మెంట్ సమీపంలోని తన పత్తి చేనుకు కాపలా వెళ్లాడు. ఈ క్రమంలో రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో చేనుకు వెళ్లిన ఆయన తెల్లవారుజామున విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో గ్రామానికి చెందిన మెడితే నరేందర్ ఫోన్ చేసి బోయిని రెడ్డి అటవీ ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.
వెంటనే కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా బోయిని రెడ్డి విద్యుత్ తీగలు తగిలి మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. సంఘటనా స్థలంలో పరిశీలించగా విద్యుత్ తీగలకు పత్తిపాక సంతోష్ పొలం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా అవుతున్నట్లు గుర్తించినట్లు భార్య తన ఫిర్యాదులో పేర్కొంది.
అడవి జంతువుల వేట కోసం విద్యుత్ తీగల ఉచ్చులు ఏర్పాటు చేయడం వల్ల తన భర్త ప్రాణాలు కోల్పోయాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటనపై గ్రామానికి చెందిన మామిడి రమేష్, మామిడి రాజనరేష్‌తో పాటు మరికొందరిపై అనుమానం వ్యక్తం చేసింది. తన భర్త మృతికి కారణమైన వారిని గుర్తించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని బోయిని సరిత అధికారులను వేడుకుంది.
గమనిక: ఈ ఘటనపై భార్య చేసిన ఆరోపణలు, అనుమానాలు మాత్రమే ప్రస్తుతం ఫిర్యాదులో వెల్లడయ్యాయి. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావాల్సిఉంది

