ఘట్కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ డివిజన్ అవుషాపూర్ గ్రామంలో సుమారు 100 ఏళ్ల చరిత్ర కలిగిన షానూర్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలను ఈ నెల 23, 24 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు మీర్ హసీం అలీఖాన్ అలియాస్ సర్ఫరాజ్ నవాబ్ తెలిపారు.
ఈ నెల 23వ తేదీ శుక్రవారం గంధం వేడుకతో ఉర్సు ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 24వ తేదీ శనివారం దీపాల (చిరాగ్) వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
వందేళ్ల చరిత్ర కలిగిన ఈ దర్గాలో ఉర్సు మహోత్సవాలను రెండు రోజులపాటు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు దర్గా ప్రతినిధులు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై షానూర్ బాబాను దర్శించుకుని వేడుకల్లో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.


