బెజ్జంకిలో వేరుశనగ విత్తనాల కోసం రైతుల బారులు!
బెజ్జంకి, అక్టోబర్ 30 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో యాసంగి సాగులో వేరుశనగ పంటను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై గిరినాథ్-4 రకం విత్తనాలను కేటాయించింది. మండలానికి 200 ఎకరాలకు సరిపడా విత్తనాలు మంజూరు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి సంతోష్ గురువారం వెల్లడించారు.శుక్రవారం నుంచి విత్తనాల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు.
విత్తనాల కోసం రైతులు తెల్లవారుజాము నుంచే మండల వ్యవసాయ కార్యాలయం,రైతు వేదిక వద్దకు భారీగా చేరుకున్నారు.పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో వచ్చి విత్తనాల కోసం బారులు తీరారు.కొందరు రైతులు తమ వంతు కోసం చెప్పులను వరుస క్రమంలో పెట్టి వేచి ఉండటం కనిపించింది. ప్రభుత్వం అందిస్తున్న 100 శాతం సబ్సిడీ విత్తనాలపై రైతులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు.

