ప్రభుత్వ పాలనలో పారదర్శకతకు ఆర్టీఐ చట్టమే ఆయుధం – జనగామలో ఘనంగా ఆర్టీఐ దినోత్సవ వేడుకలు
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 12(ప్రజావాణి): సమాచార హక్కు చట్టం 2005 దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ కమిటీ అధ్యక్షులు జంగిడి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు, రాష్ట్ర అధ్యక్షులు ఎలిగండ్ల వెంకటేష్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జావీద్ ఖాన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కమిటీ కార్యదర్శి గోపాలదాస్ ఉపేందర్, జిల్లా ఇంచార్జ్ నీలం భాస్కర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ పాలనను ప్రశ్నించే హక్కును ప్రజలకు కల్పించిన సమాచార హక్కు చట్టం-2005 ప్రజల చేతిలో శక్తివంతమైన ఆయుధమని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను పెంపొందించడంతో పాటు అధికారుల జవాబుదారీతనాన్ని నిర్ధారించడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ప్రజాధనం వినియోగంపై ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, గ్రామ పంచాయతీల నుంచి జిల్లా స్థాయి వరకు సమాచారం కోరవచ్చని, ఆర్టీఐ దరఖాస్తులకు 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలని, సమాచారం అడిగే పౌరులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బైరి భరత్, జిల్లా కార్యదర్శి నల్ల విక్రమ్, గండి నాగరాజు, పట్టణ అధ్యక్షులు గందమల్ల కమలాకర్, లింగాల ఘనపూర్ మండల అధ్యక్షులు మేడ ప్రశాంత్, స్టేషన్ ఘనపూర్ అధ్యక్షులు మహమ్మద్ సలీం, రఘునాథ్ పల్లి మండల అధ్యక్షులు కుకుడాల కిరణ్ కుమార్, జేరిపోతుల కుమార్, విద్యావేత్త గుగ్గిళ్ల రవి, నక్క నరేష్, రాష్ట్ర ఉత్తమ రైతు గుగ్గిళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

