📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

📰 Generate e-Paper Clip

ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

జీవక స్టీల్ ఫ్యాక్టరీ వద్ద స్థానికుల ఆందోళన.. కాలుష్య నివారణ చర్యలు చేపడతామని యాజమాన్యం హామీ

ప్రజావాణి
దుబ్బాక నియోజకవర్గం

చేగుంట మండల కేంద్రం : పరిశ్రమల నిర్వహణలో ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. చేగుంట మండలంలోని జీవక స్టీల్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో కాలుష్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు వ్యక్తం చేసిన ఆందోళనకు ఆయన స్పందించారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.జీవక స్టీల్ ఫ్యాక్టరీ వల్ల గాలి, నీరు, భూమి కాలుష్యానికి గురవుతున్నాయని ఆరోపిస్తూ అనంత సాగర్, ఉల్లి తిమ్మాయిపల్లి, కొండాపూర్, గొల్లపల్లి, చేగుంట, బోనాల, పులి మామిడి, పొలంపల్లి, చిన్న శివనూర్, కర్ణాల్ పల్లి, మక్కారాజ్ పేట, కరీంనగర్ తదితర గ్రామాల రైతులు, స్థానిక ప్రజలు ఫ్యాక్టరీ ఎదుట వంటావార్పు, రాస్తారోకో తదితర నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గత రెండు రోజులుగా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, ప్రాంత అభివృద్ధికి దోహదపడే మరిన్ని పరిశ్రమల ఏర్పాటును స్వాగతిస్తామని తెలిపారు. అయితే పరిశ్రమల నిర్వహణ వల్ల ప్రజల ఆరోగ్యం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జీవక స్టీల్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో గాలి, నీటి నాణ్యతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఫ్యాక్టరీ నుంచి తరలించే మట్టి కారణంగా కూడా పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని వారు పేర్కొంటున్నారని తెలిపారు. దుమ్ము, ధూళి కారణంగా రహదారి ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారని వివరించారు. నీటి నాణ్యతలో మార్పుల వల్ల వ్యవసాయంపై ప్రభావం పడుతోందని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలపై సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించి, వాస్తవ పరిస్థితులను నిర్ధారించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు అవసరమైన భద్రతా సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. కార్మికులకు భద్రతా పాదరక్షలు, హెల్మెట్లు, రక్షణ దుస్తులు, తాగునీరు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలతో పాటు బీమా కల్పించాలని కోరారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పరిసర గ్రామాల్లో సీఎస్ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని యాజమాన్యానికి సూచించారు.ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ యజమాని మోహన్ అగర్వాల్ ప్రజల సమక్షంలో ఎమ్మెల్యేతో చర్చించారు. కాలుష్య నివారణకు అవసరమైన చర్యలు చేపడతామని, స్థానిక కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, పరిసర గ్రామాల్లో సీఎస్ఆర్ నిధుల ద్వారా సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు తాత్కాలికంగా నిరసన విరమించారు.యాజమాన్యం ఇచ్చిన హామీలను నిర్ణీత గడువులోగా అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. హామీల అమలులో పురోగతి లేకపోతే తిరిగి ఆందోళన చేపడతామని స్థానికులు తెలిపారు. చేగుంట మండలంలోని అన్ని పరిశ్రమలు కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ ప్రజల ఆరోగ్యం,పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిశ్రమల నిర్వహణ కొనసాగాలని, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు, యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.తమ సమస్యలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కారంపై ఆశాభావం ఏర్పడిందని ఆందోళనలో పాల్గొన్న రైతులు, స్థానిక ప్రజలు తెలిపారు. తమ సమస్యలపై స్పందించి చర్చల్లో పాల్గొన్నందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఘటన నేపథ్యంలో చేగుంట మండలంలోని పరిశ్రమల పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలు, కాలుష్య నియంత్రణ ప్రమాణాల అమలుపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.