*షాద్‌నగర్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్*
*పెండింగ్ దర్యాప్తులు, కీలక కేసులపై సమగ్ర సమీక్ష – సకాలంలో దర్యాప్తులు పూర్తి చేయాలని ఆదేశం*
షాద్‌నగర్ ప్రజావాణి సెప్టెంబర్ 09: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీఎస్ బుధవారం షాద్‌నగర్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పోలీసు రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తుల పురోగతి, కోర్టు వ్యవహారాలు, పరిపాలనా రికార్డులను ఆయన సమగ్రంగా పరిశీలించారు.
తనిఖీలో భాగంగా గ్రేవ్ (UI) కేసులు, ఎస్సీ/ఎస్టీ కేసులు, పెండింగ్‌లో ఉన్న దర్యాప్తులు, మహిళలు మరియు పిల్లలపై నేరాలకు సంబంధించిన కేసులు తదితర అంశాలపై కమిషనర్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కేసుల్లో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు, సాధించిన పురోగతి, ఇంకా పూర్తి చేయాల్సిన దర్యాప్తు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
అదేవిధంగా కీలక కేసుల స్థితిగతులు, కేసుల దర్యాప్తు పురోగతి, కోర్టుల్లో కొనసాగుతున్న కేసులు, వాటికి సంబంధించిన ఫాలోఅప్ చర్యలపై కూడా అధికారులతో చర్చించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను నిర్లక్ష్యం చేయకుండా ప్రాధాన్యత క్రమంలో పర్యవేక్షిస్తూ, అనవసర జాప్యం లేకుండా దర్యాప్తును పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు.
కేసుల దర్యాప్తులో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అందుబాటులో ఉన్న ఆధారాలను పకడ్బందీగా సేకరించి, ప్రతి కేసును తార్కిక ముగింపుకు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్, ఏసీపీ కార్యాలయాలకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు.
కోర్టు కేసుల విషయంలో సమర్థవంతమైన ఫాలోఅప్ కొనసాగించాలని, పెండింగ్‌లో ఉన్న కోర్టు వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసులను సున్నితమైన అంశాలుగా పరిగణించి ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.
అలాగే నేరాల నియంత్రణలో భాగంగా ప్రివెంటివ్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని కమిషనర్ సూచించారు. నేరాలు జరిగిన తర్వాత స్పందించడమే కాకుండా, నేరాలకు దారితీసే పరిస్థితులను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ కేసులపై నిరంతర సమీక్ష నిర్వహిస్తూ దర్యాప్తులను వేగవంతం చేయాలని డా. తరుణ్ జోషి ఆదేశించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో షాద్‌నగర్ జోన్ డీసీపీ శ్రీమతి చ. సిరిష, షాద్‌నగర్ ఏసీపీ శ్రీ ఎస్. లక్ష్మీనారాయణతో పాటు ఏసీపీ కార్యాలయ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

