జంగంపల్లిలో పారిశుధ్యం పడకేసిందా
* ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట.. నేడు మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పర్యటన
జంగంపల్లి, సెప్టెంబర్ 5 ( ప్రజావాణి న్యూస్ )
గ్రామపంచాయతీలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందంటూ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ మరోసారి పోరుబాట పట్టనుంది. కామారెడ్డి జిల్లాలో గత కొంతకాలంగా ప్రజా సమస్యలపై దూకుడుగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్.. తాజాగా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామపంచాయతీలో పారిశుధ్య పరిస్థితులపై దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు జంగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొని గ్రామంలోని పారిశుధ్య పరిస్థితులను పరిశీలించనున్నారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యల పరిష్కారంలో పాలక యంత్రాంగం తీరుపై ఈ కార్యక్రమం ద్వారా ప్రశ్నించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇటీవల కామారెడ్డి జిల్లాలో ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా చేసుకుని బీఆర్ఎస్ నాయకులు వరుస కార్యక్రమాలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు సంబంధించిన సమస్యలపై అధికారులను ప్రశ్నించడంలో వెనుకడుగు వేయబోమనే సంకేతాలను బీఆర్ఎస్ ఇస్తోంది. జంగంపల్లి పారిశుధ్య సమస్య కూడా అదే పోరాటంలో భాగంగా మారింది.
గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్య నిర్వహణపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, అధికారుల స్పందన ఎలా ఉంది? సమస్యలకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది? అనే అంశాలపై కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు స్పష్టత కోరనున్నట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి పార్టీ అభిమానులు ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

