ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
హుజూర్‌నగర్ జాబ్‌మేళాలో ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు? ఏ కంపెనీల్లో నియమించారు?
ఎంపికైన వారి వివరాలను బహిర్గతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, సెప్టెంబర్ 20 (ప్రజావాణి): జాబ్‌మేళాల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచి శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. గతంలో హుజూర్‌నగర్‌లో నిర్వహించిన జాబ్‌మేళాలో ఎంతమంది ఎంపికయ్యారు, ఏ కంపెనీల్లో నియమితులయ్యారు, ఎంతమందికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందాయి, ప్రస్తుతం ఎంతమంది ఉద్యోగాల్లో కొనసాగుతున్నారో పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించాలని కోరారు.రైతులకు సాగునీరు అందించకుండా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకుండా జాబ్‌మేళాల పేరుతో ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. ఇచ్చే విద్యుత్‌లోనూ తరచూ కోతలు విధిస్తే రైతులు పంటలను ఎలా కాపాడుకోవాలని ప్రశ్నించారు.
కోదాడ–హుజూర్‌నగర్ పరిసరాల్లోని సిమెంట్ పరిశ్రమలు, ఇతర స్థానిక సంస్థల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు. స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించకుండా జాబ్‌మేళాల్లో వేలాది ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదన్నారు.
లస్కర్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎవరికి, ఏ పోస్టులకు, ఏ విధానంలో నియామకాలు జరిగాయో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
“ఉద్యోగమేళాల పేరుతో కేవలం సంఖ్యలు ప్రకటించడం కాకుండా కంపెనీల పేర్లు, ఎంపికైన అభ్యర్థుల సంఖ్య, వేతనాలు, అపాయింట్‌మెంట్ వివరాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. యువతకు ఉద్యోగాలు, రైతులకు సాగునీరు, పంటలకు నాణ్యమైన విద్యుత్ కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి” అని మల్లయ్య యాదవ్ అన్నారు.

