మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముల్కనూర్ గ్రామంలో ప్రజల దాహాన్ని తీర్చే నిజమైన ప్రజా నాయకత్వం ఎలా ఉండాలో సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య చూపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గాలికి వదిలేయకుండా, కేవలం రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ అందించే పథకాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించి గ్రామ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.“మాట ఇచ్చి మరిచిపోయే నాయకులు చాలామంది ఉంటారు… కానీ మాట నిలబెట్టుకునే నాయకత్వం అరుదు” అని గ్రామ ప్రజలు గర్వంగా పేర్కొంటున్నారు. తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ పథకం నిజమైన ఊరటగా మారింది.ఈ సందర్భంగా సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య మాట్లాడుతూ… “ప్రజల ఆరోగ్యం మా బాధ్యత. ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు. అభివృద్ధి మాటల్లో కాదు, పనుల్లో చూపించాలనే నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.మాజీ ఎంపిటిసి సాంబారి కొమురయ్య మాట్లాడుతూ…, ప్రజల అవసరాలను గుర్తించి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, ఇది గ్రామాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పైడిపల్లి వెంకటేష్, వార్డు సభ్యులు గట్టు రేణుక, మహమ్మద్ రజాక్, జెట్టి లత, మర్రి విజయలక్ష్మి, పంది పెళ్లి కీర్తన, వంగల రాము, పిట్టల తిరుపతి, ఇరుకుల్ల సృపిత్ గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.




