*భయంకరమైన వ్యాధిలా కుల వివక్ష*
* చిన్నారి మృతి పట్ల నివాళులర్పించిన నాయకులు.
* కుమ్మెర నిందితులకు కఠిన శిక్షలు విధించాలి.
* ముస్తాబాద్ లో బహుజన కులాల డిమాండ్.
* చదువుకున్నా కుల వివక్ష తగ్గడం లేదు.
ముస్తాబాద్,ఫిబ్రవరి 24( ప్రజావాణి)

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజక సంఘం అలాగే బహుజన సంఘాలు నిరసన చేపట్టడం జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కుమ్మేర గ్రామంలో మల్లన్న జాతరలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరి దురహంకార కారణంగా కుల వివక్ష ఘటనలో చిన్నారి మృతి చెందడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ మల్లన్న జాతరలో దర్శనానికి వెళ్లిన రజక కుటుంబం సభ్యుల పై రెడ్డి కులస్తులు కొందరు అహంకారంతో బీసీ,దళిత కుటుంబానికి చెందిన వారిపై అమానుషంగా దాడి చేసి రెండు నెలల పసికందు మరణానికి కారణమైన వాళ్లపై హత్యకేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు నమోదు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే బీసీ ఎస్సీ ఎస్టీలపై భౌతిక దాడులు భవిష్యత్తులో జరగకుండా నివారించాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ… బాధిత కుటుంబమైన గణేష్, చంద్రకళలకు ప్రభుత్వపరంగా 50 లక్షలు రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించాలన్నారు.ఈ కేసు ఘటనలో సంబంధం ఉన్న అందరనీ ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు తలగకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ బీసీ రజక కుటుంబానికి న్యాయం జరిగే వరకు బడుగు బలహీన వర్గాలు ఒక్కటిగా పోరాటం చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలను అన్ని వర్గాల వారు కండించాలని కోరారు. జాతరకు దర్శనం కోసం వెళ్లిన రజక కుటుంబాన్ని గుడిలోకి ఎలా వస్తారని ప్రశ్నిస్తూ కులం పేరుతో అవమానించడమే కాకుండా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనలో రెండు నెలల చిన్న పాప మృతి చెందడం అత్యంత దుర్ఘటనగా పేర్కొన్నారు.మన దేశంలో భయంకరమైన వ్యాధిలా కుల వివక్ష పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కుమ్మెర ఘటనకు బాధ్యులైన ఉపేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, తుకారాం రెడ్డి, సతీష్ రెడ్డి, కన్ని రెడ్డి లపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నప్పటికీ ఇంకా కుల వివక్ష కొనసాగడం బాధాకరమని మండిపడ్డారు. దేవుని ముందు అందరూ సమానమని, కుల ఆధారంగా ఆంక్షలు విధించడం అన్యాయమని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.మృతి చెందిన చిన్నారి కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కులం పేరుతో ఎవరైనా వివక్షకు పాల్పడితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో వెనుక పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల ఉపాధ్యక్షుడు ఆల్వాల వేణు, పట్టణ అధ్యక్షుడు శేరయ్య, జాతీయ బిసి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి, బిసి జేఏసీ మండల అధ్యక్షుడు కొండ యాదగిరి, దీటి నర్సింలు,మనోహర్ బిక్షపతి,భూపతి,యాదగిరి, బాలయ్య,ఎస్టీ నాయకులు మధునాయక్,నర్సింహా నాయక్,దేవయ్య,అక్కరాజు పర్శరాములు,అనిల్, ఎమ్మార్పీఎస్ నాయకుడు మల్లన్న తదితరులు పాల్గొన్నారు.



