తవణంపల్లిలో కొత్త ఎస్సైగా రమేష్ బాబు బాధ్యతలు స్వీకరణ
తవణంపల్లి, ఏప్రిల్ 27 (ప్రజావాణి):
తవణంపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో కొత్త ఎస్సైగా రమేష్ బాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఉదయం సుమారు 9:40 గంటలకు ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్సై రమేష్ బాబు మాట్లాడుతూ, మండలంలో శాంతి భద్రతలను కాపాడటం తమ ప్రాధాన్య కర్తవ్యమని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా పోలీసులను సంప్రదించాలని, దళారులను నమ్మవద్దని ఆయన సూచించారు. ప్రజలకు న్యాయం చేయడంలో ఎలాంటి రాజీ పడబోమని తెలిపారు.

