వెల్గటూర్ ఎస్ఐ ఉదయ్ కుమార్
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మే 18
(ప్రజావాణి):
సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాల పట్ల ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి వెల్గటూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పులిచర్ల ఉదయ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు, జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సోమవారం ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ…. ప్రస్తుత కాలంలో అమాయక ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీపీ లు షేర్ చేయడం, గుర్తుతెలియని ఫేక్ లింకులు క్లిక్ చేయడం, సోషల్ మీడియా ఫ్రెండ్‌షిప్‌లు, నకిలీ ఆన్‌లైన్ లోన్ యాప్‌లు, ఫేక్ జాబ్ ఆఫర్ల ద్వారా జరిగే మోసాల పట్ల ప్రజలు నిరంతరం అవగాహన కలిగి ఉండాలన్నారు. యువతలో డ్రగ్స్, ఇతర చెడు అలవాట్ల ప్రభావం పెరుగుతోందని, దీనివల్ల వారి భవిష్యత్తుతో పాటు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని హెచ్చరించారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే ప్రమాదాలు, కఠినమైన చట్టపరమైన చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కళా బృందం సభ్యులు డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాలపై ప్రత్యేక ప్రదర్శనలు, ఆలోచింపజేసే పాటలు, సందేశాల ద్వారా గ్రామీణ ప్రజలకు ఎంతో సులభంగా అర్థమయ్యేలా అవగాహన కల్పించారు. రాత్రి సమయాల్లో దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించడం, మహిళలు, విద్యార్థినులు స్వయం రక్షణకై తీసుకోవాల్సిన సురక్షిత చర్యలపై ఎస్ఐ పలు సూచనలు చేశారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకుండా, బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని కోరారు.ఈ అవేర్నెస్ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పడిధం లావణ్య మొగిలి, ఉప సర్పంచ్ అలగం తిరుపతి, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



