కమనీయం రమణీయం, రాములోరి కళ్యాణం
పాతగుడూర్ గ్రామంలో అంబరాన్నంటిన సీతారాముల కళ్యాణ మహోత్సవం
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 28 (ప్రజావాణి)
భారతీయ సంస్కృతిలో దాంపత్య జీవితానికి, ఆదర్శవంతమైన పరిపాలనకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన మహాగ్రంథం రామాయణం. ఆ రామాయణ నాయకుడు, మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి జన్మదినం సందర్భంగా జగిత్యాల జిల్లాలో ముఖ్యంగా ఎండపల్లి మండలం పాతగుడూర్ గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించబడింది. వేద మంత్రాల సాక్షిగా జగదభిరాముడి కళ్యాణాన్ని, గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద, ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణంలో నిర్వహించారు, వాతావరణమంతా శ్రీరామ నామ స్మరణతో మారుమోగింది. పండితుల వేద మంత్రోత్సవాల మధ్య, మంగళ వాయిద్యాల వేదికగా సీతారాముల కళ్యాణ తంతు శాస్త్రోక్తంగా సాగింది. లోక కళ్యాణం కోసం జరిగిన ఈ వేడుకను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు, స్థానిక గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీతమ్మ వారిని పెళ్లి కూతురిగా, రామయ్యను పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసిన తీరు భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఈ కళ్యాణ మహోత్సవంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి దంపతులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలో పాల్గొన్నారు. తమ ఇంటి ఆడపడుచుగా భావించి సీతమ్మ వారికి చీర, సారెను దంపతులు సమర్పించారు. సంప్రదాయబద్ధంగా ఓడి బియ్యం పోసి, సీతారాముల ఆశీస్సులు పొందారు. గ్రామమంతా ఒకే కుటుంబంగా మారి, శ్రీరాముని పెళ్లిని తమ ఇంటి వేడుకలా జరుపుకోవడం పాతగుడూర్ ఐక్యతకు, భక్తికి నిదర్శనంగా నిలిచింది. కళ్యాణ మహోత్సవం అనంతరం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణాన్ని వీక్షించిన భక్తులందరూ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తరించారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ…. రాముడి ఆదర్శాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని, గ్రామం సుభిక్షంగా ఉండాలని ఈ పూజలు నిర్వహించినట్లు తెలిపారు. రామరాజ్యం అంటే కేవలం పరిపాలన మాత్రమే కాదు, ధర్మం వర్ధిల్లడమని వారు పేర్కొన్నారు. పాతగుడూర్ గ్రామంలో జరిగిన ఈ కళ్యాణ వేడుక భక్తికి, ఆచారానికి అద్దం పట్టింది. అనంతరం ఆంజనేయస్వామి మాలాధారణ భక్తులు, గ్రామ ప్రజలు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో గ్రామంలోని వీధి వీధిలో శోభయాత్ర నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భారీ సంఖ్యలో గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




