వృద్ద తల్లిదండ్రులను సరిగా చూసుకోని కొడుకులకు కౌన్సిలింగ్..
సిద్దిపేట్, మార్చి 25, ప్రజావాణి
సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మీబాబు, తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట త్రీ టౌన్ పరిధిలోని ఖమ్మంపల్లి గ్రామానికిచెందినపాముకుంటా నర్సయ్య – ఎల్లవ్వ దంపతులు తమ ముగ్గురు కుమారులు యాదగిరి, కిష్టయ్య, దేవయ్యలకు తమ కష్టార్జిత ఆస్తులను సమానంగాపంచిఇచ్చినప్పటికీ, సరైన పోషణ పొందడం లేదని మార్చి 18, నాడు సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై స్పందించిన సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టాటా లక్ష్మీబాబు, మార్చి 25 నాడు ముగ్గురు కుమారులు, భార్యలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. సమాజంలో వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ ప్రతి కుమారుని ప్రాథమిక బాధ్యత అని, తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ, వాళ్ల ని వృద్ధాప్యంలో ఆదరించడం, పోషణ ఇవ్వడం, ఆరోగ్య సంరక్షణ చూడడం కుమారుల కర్తవ్యమని వివరించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం నైతికంగా తప్పే కాకుండా చట్టపరంగాను శిక్ష అర్హులని హెచ్చరించారు.కౌన్సిలింగ్ అనంతరం కుమారులు తమ తల్లిదండ్రులను ఇకపై సక్రమంగా చూసుకుంటామని, ప్రతి నెల ఖర్చులకు సరైన డబ్బులను అందిస్తామని, అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు అందరూ కలిసి వైద్యసహాయం అందిస్తామని హామీఇచ్చారు.ఈసందర్భంగా స్టేషన్ ఇన్స్పెక్టర్ టాటా లక్ష్మీబాబు, మాట్లాడుతూ.. సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాళ్, వృద్ధుల గురించి ప్రత్యేక దృష్టి సారించినందున వృద్దులైన తల్లిదండ్రులను సరిగా చూసుకోని కొడుకుల గురించి ఫిర్యాదు చేస్తే వారికి కౌన్సిలింగ్,నిర్వహించబడునని, వృద్ధుల పట్ల గౌరవం, సంరక్షణ మన సంస్కృతిలో భాగమని, ప్రతి కుటుంబం దీనిని కచ్చితంగా పాటించాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి ఖమ్మంపల్లి గ్రామానికి స్వయంగా వెళ్లి వృద్ధ దంపతుల పరిస్థితిని పరిశీలిస్తానని తెలిపినారు.ఇన్స్పెక్టర్ జోక్యంతో కుటుంబ వివాదం సఖ్యతగా పరిష్కారమవడంతో వృద్ధ దంపతులు పాముకుంటా నర్సయ్య-ఎల్లవ్వలు పోలీసుల సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు..




