సామాన్యుడి ఫోన్ కాల్‌కు స్పందిస్తున్న దేవరకద్ర ఎమ్మెల్యే….
ఫోన్ చేస్తే స్పందన… సమస్య చెప్పితే పరిష్కారం
పనులతో ప్రజల మనసు గెలుస్తున్న జీఎంఆర్…

ఒంటరి ప్రయాణం నుంచి జనసంద్రం వరకు…
ఎమ్మెల్యే పనితీరు పట్ల ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల నుంచి సైతం ప్రశంసలు…
దేవరకద్ర: ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదు… ప్రజల సమస్యలను తనవిగా భావించి స్పందించడం కూడా అంతే ముఖ్యమైన విషయం. అలాంటి నాయకత్వానికి ఉదాహరణగా నిలుస్తున్నారు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్).
సామాన్య ప్రజలు ఫోన్ చేసి తమ సమస్య చెప్పగానే వెంటనే స్పందిస్తూ పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడటం ఆయన ప్రత్యేకతగా మారింది. “అన్న ఆపద ఉందంటే వెంటనే స్పందన” అనే నమ్మకం ప్రజల్లో పెరగడంతో ఆయనకు నేరుగా ఫోన్ చేసి సమస్యలు చెప్పే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. స్థానికంగా చూస్తే ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లకుండానే ఫోన్ ద్వారా సమస్య పరిష్కారం పొందిన ఉదాహరణలు అనేకం ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు.
విద్యార్థిని చదువుకు అండగా ఎమ్మెల్యే…
అడ్డాకుల మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన తండ్రి తన కుమార్తెను చదివించేందుకు ప్రైవేట్ కళాశాలకు వెళ్లగా సీటు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆయన నేరుగా ఎమ్మెల్యే జీఎంఆర్‌కు ఫోన్ చేసి సమస్య వివరించారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కళాశాల యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థిని చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు. దీంతో ఆ కుటుంబం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపింది.
ప్రమాదంలో చిక్కుకున్న కుటుంబానికి రక్షణ…
కౌకుంట్ల మండలానికి చెందిన ఒక ఆటో డ్రైవర్ కుటుంబంతో కలిసి పని నిమిత్తం జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌కు వెళ్లగా అక్కడ ఒక చిన్న ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కుటుంబంపై దాడి చేసే ప్రయత్నం జరగడంతో బాధితుడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ఫోన్ చేసి జరిగిన విషయం వివరించాడు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే స్థానిక అధికారులకు ఫోన్ చేసి సంఘటన స్థలానికి పంపించి గొడవ పెద్దది కాకుండా బాధిత కుటుంబానికి రక్షణ కల్పించారు.
పై రెండు సంఘటనలకు సంబంధించి బాధితులకు ఎమ్మెల్యే తో పెద్దగా పరిచయం లేనప్పటికీ తెలిసిన వ్యక్తి సూచనతో ఎమ్మెల్యే కు ఫోన్ చేశామని సమస్య అని చెప్తే ఎమ్మెల్యే వెంటనే స్పందించిన తీరుపట్ల ఆ కుటుంబాలు సంతోషంతోపాటు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు..
ఇలాంటి సంఘటనలు కేవలం మచ్చుతునకలు మాత్రమే అని స్థానికులు చెబుతున్నారు. సమస్య ఉందంటూ తన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని పలకరిస్తూ పరిష్కారం కోసం అప్పటికప్పుడే కృషి చేస్తున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పనితీరుపై ప్రజల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామాల్లో జరిగే చిన్న చిన్న సమస్యల నుంచి విద్య, వైద్యం, సంక్షేమ పథకాల వరకు ప్రజలు నేరుగా ఆయనను సంప్రదించగలగడం వల్ల ప్రజా ప్రతినిధిగా ఆయనపై విశ్వాసం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు.
పార్టీలకు అతీతంగా సేవ…
రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినా ప్రజల సమస్యల విషయంలో పార్టీ భేదాలు చూడకూడదనే భావనతో జీఎంఆర్ ముందుకు సాగుతున్నారు. సంక్షేమ పథకాలు అందించడంలో పార్టీతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలనే ధోరణి ఆయనలో కనిపిస్తోంది. అనారోగ్య సమస్యలు, విద్యార్థుల చదువు, పేద కుటుంబాల అవసరాలు వంటి విషయాల్లో ఆయన చూపుతున్న మానవతా దృక్పథం ప్రజల్లో మరింత ఆదరణ తెచ్చిపెడుతోంది. ప్రత్యర్థి పార్టీలైన బిజెపి బిఆర్ఎస్ పార్టీల కరుడుగట్టిన కార్యకర్తలు సైతం ఈ విషయంలో ఎమ్మెల్యేను అభినందించడం గమనార్హం…
స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశం…
ప్రజల సమస్యలకు ఎమ్మెల్యే నేరుగా స్పందించడం స్థానిక రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. చాలామంది మండల స్థాయి నాయకులు తమను సంప్రదించకుండానే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాలపై ఎమ్మెల్యే మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిశ్శబ్దంగా తన పని తాను కొనసాగిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
జననేతగా ఎదుగుతున్న జిఎంఆర్
గత ఎన్నికల సమయంలో ఒంటరిగా మొదలైన ఆయన రాజకీయ ప్రయాణం నేడు వేలాది మంది ప్రజల మద్దతుతో ముందుకు సాగుతోంది. ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకోవడం, అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కారం చూపించడం వల్ల ఆయనపై విశ్వాసం మరింత పెరిగింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఎలాంటి గర్వం లేకుండా సామాన్య ప్రజలతో కలిసిపోతూ ఉండటం ఆయన నాయకత్వానికి ప్రత్యేక గుర్తింపుగా మారింది. సామాన్యుడి సమస్యను తన సమస్యగా భావించి స్పందించే నాయకుడే నిజమైన ప్రజానాయకుడు. ఆ దిశగా ముందుకు సాగుతూ ప్రజల మధ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు ఎమ్మెల్యే జీఎంఆర్. ప్రజల సమస్యల పట్ల ఆయన తీసుకుంటున్న చొరవ ఇదే విధంగా కొనసాగితే గత ఎన్నికల సమయంలో ఆయన నడిచిన రాళ్లబాట రాబోయే ఎన్నికల సమయానికి పూలబాటగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.




