*హుజూర్‌నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లోపాలు వెంటనే సరిచేయాలి*
*జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్*
సూర్యాపేట / ప్రజావాణి జిల్లా బ్యూరో, నవంబర్ 4:
హుజూర్‌నగర్ రామస్వామిగుట్ట వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలోని చిన్నచిన్న లోపాలను వెంటనే సరిచేసి, మిగిలిపోయిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఎస్పీ కే. నరసింహతో కలిసి మోడల్ కాలనీలోని ప్రతి బ్లాక్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఇళ్లలో గుర్తించిన లోపాలను వెంటనే సరిచేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు సూచించారు. అలాగే డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

