ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన స్థానిక సంస్థల ఎన్నికలను, అధికార బలంతో అపహాస్యం చేయడం దేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. ఓటు హక్కు, పోటీ చేసే హక్కును కాలరాసే వ్యవస్థలు ఎప్పటికీ మనుగడ సాగించలేవు.”
పోరుమామిళ్ల అక్టోబర్ 21 ప్రజావాణి రాష్ట్రంలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికార పార్టీ నేతలు,పోలీసులు కలిసి చేస్తున్న అరాచకాలపై మాజీ పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈరోజు ఉదయం ఆయనను పోలీసులు గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్) చేసిన నేపథ్యంలో, ఆయన మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, ఎన్నికల సంఘం నిష్క్రియాపరత్వాన్ని తీవ్రంగా ఖండించారు.తమను గృహ నిర్బంధం చేయడంపై నాగార్జున రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ,జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అధికార పార్టీ నాయకులు గుండాలుగా,రౌడీలుగా మారి దౌర్జన్యాలకు తెగబడుతున్నారని ఆరోపించారు.దురదృష్టవశాత్తూ శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ, పైఅధికారుల అప్రజాస్వామిక ఆదేశాలకు తలొగ్గి ఈ అక్రమాలకు పూర్తి స్థాయిలో సహకరిస్తోందని ఆయన మండిపడ్డారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నడూ,ఏ ఎన్నికల్లోనూ ఇటువంటి దారుణమైన పరిస్థితులు దేశంలో ఎక్కడా లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల కంటే ఘోరంగా.. సుప్రీంకోర్టు చీవాట్లు
గత వారం జరిగిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు ఒక ఎత్తయితే, ప్రస్తుతం జరుగుతున్న పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ అంతకంటే అత్యంత ఘోరంగా తయారైందని నాగార్జున రెడ్డి విమర్శించారు. నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు గట్టిగా బుద్ధి చెప్పిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. న్యాయస్థానాలు హెచ్చరించిన తర్వాతనైనా ఎన్నికల కమిషన్ తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఆన్లైన్ నామినేషన్లే శరణ్యం
ప్రస్తుత అక్రమ నామినేషన్ల ప్రక్రియను తక్షణమే అరికట్టి, ఎన్నికలను న్యాయబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించకపోతే ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం పాలు కావడం తథ్యమని నాగార్జున రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అప్రజాస్వామిక పరిణామాలను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు.అభ్యర్థులపై భౌతిక దాడులు,నామినేషన్ పత్రాల చింపివేతలకు అడ్డుకట్ట వేయాలంటే, నామినేషన్ల స్వీకరణ పద్ధతిని పూర్తిగా ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని ఆయన ఎన్నికల కమిషన్ను గట్టిగా డిమాండ్ చేశారు. ఆన్లైన్ నామినేషన్ల ప్రక్రియ ద్వారానే అభ్యర్థులకు రక్షణ ఉంటుందని, అప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారవుతారని ఆయన స్పష్టం చేశారు.

