గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం
రూ.200 కోట్లతో ఆలయ అభివృద్ధి.. ఇప్పటికే రూ.70 కోట్ల నిధులు మంజూరు
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
దండేపల్లి, అక్టోబర్ 21 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆయన కుటుంబ సమేతంగా హాజరై భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని సుమారు రూ.200 కోట్లతో అభివృద్ధి చేసి, అన్నవరం క్షేత్రం తరహాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.70 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు.
గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు గూడెం క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేసి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గూడెం పుణ్యక్షేత్రానికి రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఎమ్మెల్యే తనయుడు కొక్కిరాల చరణ్ రావు, డీసీపీ భాస్కర్, ఆలయ ఈఓ శ్రీనివాస్, ఆలయ అర్చకులు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు అక్కల వెంకటేశ్వర్లు, రామగిరి బానేష్, సింగిల్ విండో చైర్మన్లు నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, మంచిర్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గుండ సుధాకర్, మంచిర్యాల జిల్లా ఆర్జీపీఆర్‌ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అలాగే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

