తాళ్లపేటలో బతుకమ్మ సంబురాల్లో ఘర్షణ
రెండు కాంగ్రెస్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం.. ఉద్రిక్తతకు దారితీసిన ఘటన
సీఐ లాఠీఛార్జిపై ఆందోళన.. సస్పెండ్ చేయాలని డిమాండ్
తాళ్లపేటలో భారీగా పోలీసుల మోహరింపు
దండేపల్లి, అక్టోబర్ 19 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలు రెండు కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణకు దారితీశాయి. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు (పీఎస్ఆర్) వర్గీయులకు, మంత్రి వివేక్ ప్రధాన అనుచరుడు మంతెన జగన్మోహన్ రావు వర్గీయులకు మధ్య వివాదం చెలరేగి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనతో బతుకమ్మ సంబురాల ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
లాఠీఛార్జితో పరుగులు తీసిన మహిళలు
ఘర్షణకు సంబంధించిన సమాచారం అందుకున్న లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీఛార్జి చేసినట్లు సమాచారం. దీంతో బతుకమ్మలతో ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా పాల్గొంటున్న మహిళలు భయంతో తలోదిక్కుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కొందరు కిందపడటంతో గాయాలైనట్లు తెలిసింది.
సీఐపై వర్గీయుల ఆరోపణలు
ఈ ఘటనలో జగన్మోహన్ రావు వర్గానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, స్థానిక గిరిజన మహిళా సర్పంచ్ కుర్సింగ కళావతి, ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి తదితరులు సీఐ రమణమూర్తి తమపై లాఠీతో దాడి చేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న జగన్మోహన్ రావు వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో తాళ్లపేట బస్టాండ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్
అర్ధరాత్రి సమయంలో జగన్మోహన్ రావు, జీసీసీ మాజీ చైర్మన్ కొట్నాక తిరుపతి తాళ్లపేటకు చేరుకున్నారు. తమ వర్గీయులతో కలిసి రోడ్డుపై బైఠాయించి పోలీసుల తీరును నిరసించారు. సీఐ రమణమూర్తిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మరోసారి ఘర్షణ.. భారీగా పోలీసుల మోహరింపు
ఆందోళన కొనసాగుతున్న సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎమ్మెల్యే పీఎస్ఆర్ వర్గీయులు బస్టాండ్ వద్దకు చేరుకుని అనుకూల నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య మరోసారి తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఏర్పడటంతో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులను తాళ్లపేటకు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బతుకమ్మ పండుగ వేడుకల్లో చోటుచేసుకున్న ఈ రాజకీయ వర్గాల ఘర్షణ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పండుగ సంబురాలు ఉద్రిక్తతకు దారితీయడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

