*ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన గిరిజన విద్యార్థికి ఎమ్మెల్యే సునీతారెడ్డి ఘన సత్కారం*
సోమక్కపేట కు చెందిన జారప్ల ప్రశాంత్ కు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే
చిలిపిచెడ్, అక్టోబర్ 18 (మన ప్రజావాణి నియోజకవర్గ ప్రతినిధి)
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం సోమక్కపేట గ్రామపంచాయతీ రహీంగూడ తండాకు చెందిన జారప్ల ప్రశాంత్, తండ్రి సుదర్శన్ అద్భుత ఘనత సాధించారు.
ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ గా నిలిచిన ప్రశాంత్, పీజీ, పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఎస్టీ కేటగిరికి చెందిన ప్రశాంత్ వ్యవసాయ ఆధారిత నిరుపేద కుటుంబానికి చెందినవారు. అష్ట కష్టాలు అనుభవిస్తూ, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ఉన్నత చదువులు చదివి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
ఈ సందర్భంగా చిట్కుల్ గ్రామ శివారులోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ప్రశాంత్ ను ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేద గిరిజన కుటుంబం నుండి వచ్చి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఎంతో గర్వకారణమని, ఇలాంటి విద్యార్థులు మండలానికే కాకుండా రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. ప్రశాంత్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మణ్, శ్రీకాంత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అనిల్, దుర్గారెడ్డి, ధర్మారెడ్డి, ఎండి షాపియోద్దీన్, విష్ణువర్ధన్ రెడ్డి, ముకుందరెడ్డి, రాజిరెడ్డి, కిషన్ రెడ్డి, సుధాకర్, శంకరయ్య, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

