ఘట్కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎన్ఎఫ్సీ నగర్లో బతుకమ్మ వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కొమ్మగోని మహిపాల్, రామాదేవి వేడుకల్లో పాల్గొని దుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతిరూపమని పేర్కొన్నారు. పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు పాటలు పాడుతూ, ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి మహిళలు సందడి చేయడంతో ఎన్ఎఫ్సీ నగర్లో పండుగ వాతావరణం నెలకొంది.
ఇలాంటి పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. భక్తులు, మహిళలు, స్థానికులు పాల్గొనడంతో బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి.


