ఘట్కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని కొండాపూర్ స్ట్రీట్ నంబర్ 4లో బతుకమ్మ వేడుకలను కోరుబోతు నాగరాజు, ఇమ్మడి ఉపేంద్ర రాణి, , ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా తమ కాలనీలో పండుగ సంప్రదాయాలను కొనసాగిస్తూ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, మహిళల ఆటపాటలు, కోలాటాల సందడి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలుస్తాయని అన్నారు.
కొండాపూర్లోని ప్రతి తెలంగాణ ఇంటా ఆనందం వెల్లివిరియాలని, ప్రతి ఆడపడుచు ముఖంలో చిరునవ్వు కనిపించాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, తమ కాలనీ ఐకమత్యానికి, ప్రేమానురాగాలకు నిలయంగా ఉండాలని కోరుకున్నారు. బతుకమ్మ తల్లి ఆశీస్సులతో కాలనీ ప్రజలందరికీ మేలు జరగాలని, పాడిపంటలతో, సిరిసంపదలతో తెలంగాణ నేల సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బతుకమ్మ పండుగను ఐకమత్యంతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ వేడుకల్లో కాలనీ మహిళలు, చిన్నారులు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.

