టిబీ ముక్త్ గ్రామ పంచాయతీగా తలారివానిపల్లికి జాతీయ స్థాయి గుర్తింపు
బెజ్జంకి, అక్టోబర్ 8 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తలారివానిపల్లి గ్రామం టిబీ (క్షయ) ముక్త్ గ్రామ పంచాయతీగా జాతీయ స్థాయిలో ఎంపికైంది. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ గండికోట సురేష్‌ను ఘనంగా సన్మానించారు.గ్రామాన్ని టిబీ ముక్త్ గ్రామ పంచాయతీగా ఎంపిక చేయడం గ్రామ ప్రజలకు గర్వకారణమని సర్పంచ్ గండికోట సురేష్ పేర్కొన్నారు. గ్రామ ప్రజల సహకారం, గ్రామ మరియు మండల వైద్యాధికారులు, వైద్య సిబ్బంది నిరంతర కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని తెలిపారు.
టిబీ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడం, వ్యాధి నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టడం, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది చేసిన కృషి ఈ గుర్తింపునకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటంతో పాటు వైద్యశాఖ సూచనలను పాటించడం కూడా ఈ విజయానికి దోహదపడిందన్నారు.తలారివానిపల్లి గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల సహకారంతో భవిష్యత్తులోనూ ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తామని సర్పంచ్ గండికోట సురేష్ తెలిపారు.

