📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కుల వివక్షత పాటిస్తే ఉధృతమైన ఉద్యమం: దళిత ప్రజా సంఘాల ఘాటు హెచ్చరిక!

కుల వివక్షత పాటిస్తే ఉధృతమైన ఉద్యమం: దళిత ప్రజా సంఘాల ఘాటు హెచ్చరిక!

📰 Generate e-Paper Clip

ఎర్రగుడిపాడు చెన్నకేశవ స్వామి ఆలయ ఘటనపై బద్వేల్‌లో దళిత నేతల ఆగ్రహం అంటరానితనాన్ని పెంచి పోషిస్తున్న అగ్రకుల అహంకారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, తూతూమంత్రపు చర్యలు సరికావని నిరసన
బద్వేల్,అక్టోబర్ 7ప్రజావాణి:సమాజంలో కుల వివక్షతను రూపుమాపకుండా, అంటరానితనాన్నిఇంకా పెంచి పోషిస్తే దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉధృతమైన ఉద్యమాలు చేపడతామని దళిత నేతలు ఘాటుగా హెచ్చరించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశించినట్లుగా కుల వివక్షత లేని సమసమాజం,ఆయన కలగన్న రాజ్యం నేటి సమాజంలో ఎక్కడా కనిపించడం లేదని, ప్రస్తుతం కుల వివక్ష నాలుగు పాదాల మీద నడుస్తోందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం నాడు కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ కేంద్రంలో దళిత ప్రజా సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డప జిల్లా కమలాపురం మండలం ఎర్రగుడిపాడు గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి దళితులు రావద్దంటూ హుకుం జారీ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. అక్కడ మాజీ సర్పంచ్‌గా ఉన్న ఏనుగుల బ్రహ్మానంద రెడ్డి దళితులపై చేసిన కుల వివక్షా పూరిత వ్యాఖ్యలు,దౌర్జన్యంపై ప్రభుత్వం మరియు పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో వేచి చూస్తామని,కేవలం తూతూమంత్రంగా సెక్షన్లు పెట్టి నిందితులను వదిలేస్తే ఊరుకునేది లేదని డిమాండ్ చేశారు. చిన్న పాప అని కూడా చూడకుండా బండబూతులు:ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నాయకులు వెల్లడిస్తూ… ఎర్రగుడిపాడు గ్రామానికి చెందిన ఒక దళిత భక్తుడు (చంద్ర) దేవునిపై ఉన్న భక్తితో,తన చిన్న పాపను చంకన పెట్టుకుని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయానికి దండం పెట్టుకోవడానికి వెళ్లాడని తెలిపారు. అక్కడ ఉన్న అగ్రకుల అహంకారి,మాజీ సర్పంచ్ బ్రహ్మానంద రెడ్డి ఆ విషయాన్ని గమనించి,కనీసం చిన్న పాప అని కూడా చూడకుండా మానవత్వం మరిచి ప్రవర్తించాడని ఆరోపించారు.”దళితులకు ఆలయ ప్రవేశం లేదు, మీరు వస్తే గుడి మైలపడిపోతుంది”అంటూ కించపరుస్తూ,”మాలా,మాదిగ నా కొడుకుల్లారా.మీరు దేవుడిని దర్శించుకోవడానికి వీల్లేదు”అని నోటికొచ్చినట్లు బండబూతులు తిడుతూ తీవ్రంగా అవమానించడం సభ్య సమాజం తలదించుకునే చర్య అని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై అనుమానాలు –పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి:ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా వైరల్ కావడంతో, ప్రజాసంఘాల ఒత్తిడి మేరకు అధికారులు స్పందించి హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. అనంతరం దళితులను ఆలయ దర్శనానికి తీసుకువెళ్లినప్పటికీ,ఈ ప్రక్రియ అంతా కూడా తూతూమంత్రంగా జరిగిందని, అధికారుల తీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని దళిత నేతలు పేర్కొన్నారు. నిజంగా ప్రభుత్వానికి,అధికారులకు అంటరానితనాన్ని రూపుమాపాలనే చిత్తశుద్ధి ఉంటే. దళితులను ఆలయంలోకి రావద్దని అడ్డుకున్న వారిని,కులదూషణలు చేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి అవమానకరమైన ఘటనలు భవిష్యత్తులో ఎక్కడా పునరావృతం కాకుండా గట్టి నిఘా ఉంచాలని, బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని కోరారు.దేవుని ముందు అందరూ సమానులనే కనీస భావనను అగ్రవర్ణాల్లో కలిగించేలా ప్రభుత్వం మరియు ఎస్సీ కార్పొరేషన్లు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, దళితులకు అన్ని దేవాలయాల్లోనూ స్వేచ్ఛగా ప్రవేశం కల్పించేలా శాశ్వత చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.బద్వేల్‌లో జరిగిన ఈ నిరసన మరియు విలేకరుల సమావేశంలో దళిత సీనియర్ నాయకులు బత్తలకూర కేశవయ్య,అంబేద్కర్ ఆశయ సాధన సమితి అధ్యక్షులు ముళ్లపాటి పిచ్చయ్య,దళిత హక్కుల పోరాట సమితి కార్యనిర్వాహక కార్యదర్శి పడిగే వెంకటరమణ,దళిత నాయకులు మెరుగు చిన్నయ్య, పి.చిన్నయ్య మరియు ఇతర అనుబంధ సంఘాల కార్యకర్తలు,బాధితుల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.