📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని లక్ష్యాన్ని సాధించాలి

ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని లక్ష్యాన్ని సాధించాలి

📰 Generate e-Paper Clip

ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని లక్ష్యాన్ని సాధించాలి

క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో విజయం సాధించాలి : జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ..

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న యువతీ యువకులకు ఉద్యోగ సాధనకు అవసరమైన పలు సూచనలు చేస్తూ దిశా నిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ అందించడం అభినందనీయమని అన్నారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టడంతో పాటు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. శిక్షణలో అందించే బోధనను శ్రద్ధగా వినడంతో పాటు ప్రతిరోజూ స్వయంగా చదువుకునేందుకు సమయాన్ని కేటాయించాలని తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ మాట్లాడుతూ ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతీ యువకులకు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అవసరమైన సహకారం, ప్రోత్సాహం అందిస్తున్న జిల్లా కలెక్టర్ గారికి పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిక్షణ కేంద్రంలో సుమారు 350 మంది యువతీ యువకులకు 45 రోజుల పాటు ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించే రాత పరీక్షలతో పాటు ఉద్యోగ ఎంపిక ప్రక్రియలోని వివిధ దశలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు సమగ్రంగా సిద్ధం కావాలని సూచించారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి కేవలం శిక్షణ తరగతులకు హాజరు కావడం మాత్రమే కాకుండా, ప్రతిరోజూ క్రమం తప్పకుండా చదవడం, గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం, మాక్ టెస్టులు రాయడం, సమయపాలన పాటించడం ఎంతో ముఖ్యమని ఎస్పీ తెలిపారు. శిక్షణ సమయంలో తమకు వచ్చే సందేహాలను వెంటనే శిక్షకులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. “మీ భవిష్యత్తును మార్చుకునేందుకు ఈ ఉచిత శిక్షణ ఒక మంచి అవకాశంగా భావించాలి. 45 రోజుల శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని, క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగాలి” అని ఎస్పీ యువతీ యువకులకు సూచించారు. యువత తమ లక్ష్య సాధనకు ఆటంకం కలిగించే అనవసర విషయాలకు దూరంగా ఉండాలని, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాను అవసరమైన మేరకే ఉపయోగించాలని సూచించారు. శారీరక దృఢత్వానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ప్రతిరోజూ వ్యాయామం, పరుగు వంటి శారీరక శిక్షణలో పాల్గొనాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ శిక్షణ తరగతులను పరిశీలించి అభ్యర్థులతో మాట్లాడారు. శిక్షణలో అందుతున్న బోధన, అభ్యర్థులకు కల్పిస్తున్న సదుపాయాలు, శిక్షణా విధానం తదితర అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ ఉచిత శిక్షణ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అధికారులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో అడిషనల్ ఎస్పి రమేష్,డిటిసి డిఎస్పీ నగేష్, ఎస్బి సీఐ నాగరాజు,సీఐ కరుణాకర్, ఆర్.ఐ లు సంతోష్, హరిబాబు, ఎస్.ఐ లు, సిబ్బంది, శిక్షణ పొందుతున్న సుమారు 350 మంది యువతీ యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.