అంగన్వాడీ, ఆశా కార్యకర్తల సేవలు అమూల్యం
ప్రజల ఆరోగ్యం, పిల్లల పౌష్టికాహారంలో కీలక పాత్ర: బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్
మనోహరాబాద్: మండలంలోని జీడిపల్లి గ్రామంలో ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా సమాజానికి విశేష సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో వారు చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు.
సేవా సంకల్ప అభియాన్ కన్వీనర్ కొల్తూరి నరేష్ గౌడ్, కో-కన్వీనర్ పరుం నరేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, గర్భిణులు, బాలింతల సంరక్షణలో వారు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. సమాజానికి నిస్వార్థంగా సేవలందిస్తున్న వారిని గుర్తించి సన్మానించడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు.
కార్యక్రమ కన్వీనర్ కొల్తూరి నరేష్ గౌడ్, కో-కన్వీనర్ పరుం నరేష్ మాట్లాడుతూ.. సమాజ సేవలో ముందుండే వారిని గుర్తించి ప్రోత్సహించడమే ‘సేవా సంకల్ప అభియాన్’ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నాగు, నర్సుగారి సామి తదితరులు పాల్గొన్నారు.

