📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్సైబర్ నేరాల పై అవగాహన ఫ్లాష్ వాక్

సైబర్ నేరాల పై అవగాహన ఫ్లాష్ వాక్

📰 Generate e-Paper Clip

సైబర్ నేరాలపై అవగాహన ఫ్లాష్ వాక్

విద్యార్థులు, యువత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నల్లగొండ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ పట్టణంలోని ఎస్.ఆర్. జూనియర్ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం, ఆన్‌లైన్ లావాదేవీల వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ప్రజలను వివిధ రకాలుగా మోసం చేసి బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత వివరాలు, డబ్బును కాజేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో సైబర్ మోసాల కారణంగా ప్రతి సంవత్సరం సుమారు రూ.1,800 కోట్ల మేర నష్టం జరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు, క్యూ ఆర్ కోడ్/ యుపిఐ మోసాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలు, ఒటిపి పిన్ దొంగతనం, నకిలీ ఉద్యోగ అవకాశాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, అనుమానాస్పద లింకులు, ఎపికె ఫైళ్ల ద్వారా జరిగే మోసాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా ఫోన్ చేసి పోలీసు అధికారి, ప్రభుత్వ అధికారి, బ్యాంకు అధికారి లేదా ఇతర సంస్థల ప్రతినిధులమని చెప్పి బెదిరించినా, వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలు అడిగినా నమ్మవద్దని ఎస్పీ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒటిపి, ఏటిఎం పింన్, యుపిఐ పింన్, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకోవద్దన్నారు. అలాగే గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయడం, అనుమానాస్పద ఎపికె లను డౌన్‌లోడ్ చేయడం, తెలియని క్యూ ఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం చేయవద్దని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు, బహుమతులు, రుణాల పేరుతో వచ్చే ప్రకటనలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే స్పందించాలని సూచించారు. ప్రజలు సైబర్ మోసాలకు గురికాకుండా “Pause – Think – Verify” (ఆగండి – ఆలోచించండి – నిర్ధారించుకోండి) అనే విధానాన్ని పాటించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. అనుమానాస్పద కాల్, మెసేజ్ లేదా ఆన్‌లైన్ లావాదేవీ ఎదురైనప్పుడు తొందరపడి స్పందించకుండా ముందుగా వివరాలను ధృవీకరించుకోవాలని అన్నారు. సైబర్ ఆర్థిక మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత త్వరగా మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థులు, యువత సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించుకొని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులకు కూడా అవగాహన కల్పించాలని ఎస్పీ కోరారు. సైబర్ నేరాల నియంత్రణలో పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ ఫ్లాష్ వాక్ ద్వారా విద్యార్థులు, యువత, ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ “అప్రమత్తతే సైబర్ నేరాల నుంచి రక్షణ” అనే సందేశాన్ని విస్తృతంగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్బి సీఐ నాగరాజు, 2 టౌన్ సీఐ ఆది రెడ్డి,ఎస్. ఐ సైదా బాబు అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, యువత, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.