📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరాయల్ ఎన్‌ఆర్‌ఐ సిటీ పార్కు స్థలానికే ఎసరు

రాయల్ ఎన్‌ఆర్‌ఐ సిటీ పార్కు స్థలానికే ఎసరు

📰 Generate e-Paper Clip

*రాయల్ ఎన్‌ఆర్‌ఐ సిటీ పార్కు స్థలానికే ఎసరు!*

*అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట ఏదీ?

*మున్సిపల్‌ కమిషనర్‌కు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వినతి.. స్థలాన్ని కాపాడాలని డిమాండ్‌

పటాన్‌చెరు, అక్టోబర్‌ 1 (ప్రజావాణి): ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని రాయల్‌ ఎన్‌ఆర్‌ఐ సిటీ కాలనీలో పార్కు, ప్రజా వినియోగం కోసం కేటాయించిన ఓపెన్‌ స్పేస్‌ స్థలానికే ఎసరు పడిందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమోదిత లేఅవుట్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొంటూ రాయల్‌ ఎన్‌ఆర్‌ఐ సిటీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
కాలనీకి సంబంధించిన సర్వే నంబర్లు 164, 166, 167, 168, 169, 170, 171, 172, 173లో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని అసోసియేషన్‌ ప్రతినిధులు ఆరోపించారు. ఆమోదిత లేఅవుట్‌ ప్లాన్‌లో పార్కు స్థలం స్పష్టంగా ఉన్నప్పటికీ, సరైన హక్కు పత్రాలు, లింక్‌ డాక్యుమెంట్లు లేకుండానే స్థలాన్ని విక్రయిస్తూ శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని వారు తెలిపారు.
పార్కు ఉంటుందనే నమ్మకంతోనే ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేశాం అని కాలనీ వాసులు పేర్కొన్నారు. పార్కు స్థలం అన్యాక్రాంతమైతే కాలనీలోని ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని, పిల్లలు, వృద్ధులు, మహిళలకు అందుబాటులో ఉండాల్సిన ప్రజా స్థలం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై స్థానిక కౌన్సిలర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. ఆమోదిత లేఅవుట్‌ ప్లాన్‌, మున్సిపల్‌ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి, పార్కు స్థలంలో జరుగుతున్న నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని వారు మున్సిపల్‌ కమిషనర్‌ను కోరారు. స్థలాన్ని ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించి, ప్రజల వినియోగానికి పార్కుగా అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు.
ఈ సందర్భంగా ఆమోదిత లేఅవుట్‌ మ్యాప్‌, నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలు, అసోసియేషన్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలను అధికారులకు అందజేశారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ. రాజు ఆధ్వర్యంలో వైస్‌ ప్రెసిడెంట్‌ మనోహర్‌, కోశాధికారి ప్రకాష్‌, సలహాదారు కిన్నెర రవి, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ నవాజ్‌ రెడ్డి తదితరులు మున్సిపల్‌ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.