పీఎం-రాహత్ పథకంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి
ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి చేర్చడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి
మేడ్చల్: రోడ్డు ప్రమాదాల సమయంలో క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందించి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-రాహత్ ప్రధాన మంత్రి రోడ్డు ప్రమాద బాధితుల హాస్పిటల్ మరియు చికిత్స పథకంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని మేడ్చల్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి కోరారు.
రోజురోజుకూ జనాభాతో పాటు వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు అధికమవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో క్షతగాత్రుడిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించి సమీపంలోని పథకానికి అనుబంధ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
పీఎం-రాహత్ పథకం కింద అర్హత ఉన్న రోడ్డు ప్రమాద బాధితులకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స అందిస్తారని, ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్ఠంగా ఏడు రోజుల వరకు ఈ చికిత్స వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం మోటారు వాహనం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి వర్తిస్తుంది.
ప్రమాదం జరిగిన వెంటనే 112కు ఫోన్ చేస్తే సమీపంలోని డిజిగ్నేటెడ్ ఆసుపత్రి వివరాలు, అంబులెన్స్ సహాయం పొందవచ్చని తెలిపారు. ప్రమాద బాధితుడు, ‘రహ్-వీర్’ (గుడ్ సమారిటన్) లేదా ప్రమాద స్థలంలో ఉన్న ఎవరైనా 112ను సంప్రదించవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రమాదం జరిగినప్పుడు పోలీసు కేసులు, ఇతర ఇబ్బందులు వస్తాయనే భయంతో చాలామంది బాధితులకు సహాయం చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారని, అలాంటి భయాలను పక్కనపెట్టి మానవతా దృక్పథంతో స్పందించాలని కృష్ణప్రియ మల్లారెడ్డి కోరారు. గోల్డెన్ అవర్‌లో అందించే తక్షణ వైద్యం ప్రమాద బాధితుడి ప్రాణాలను కాపాడడంలో అత్యంత కీలకమని తెలిపారు.
పథకం అమలులో భాగంగా ఆసుపత్రులు, పోలీసు వ్యవస్థ, రవాణా శాఖకు సంబంధించిన డిజిటల్ వ్యవస్థలను అనుసంధానం చేశారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అర్హత ఉన్న బాధితులకు చికిత్స నిరాకరించకుండా వ్యవస్థను రూపొందించారు.
“ప్రమాదం జరిగిన ప్రదేశంలో క్షతగాత్రుడిని అలాగే వదిలేయకుండా, వెంటనే 112కు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించేందుకు సహకరించాలి. మన కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు మాత్రమే కాకుండా ఎవరికి ప్రమాదం జరిగినా మనకు చేతనైన సహాయం అందిద్దాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఇతరులకు తెలియజేయాలి. మనం చేసే చిన్న సహాయం ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు” అని బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి అన్నారు.

