📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్భగత్ సింగ్ స్ఫూర్తితో ఎన్నికల హామీల అమలుకై ఉద్యమిద్దాం: డివైఎఫ్ఐ మండల నాయకులు రత్నమయ్య, సుందరయ్య...

భగత్ సింగ్ స్ఫూర్తితో ఎన్నికల హామీల అమలుకై ఉద్యమిద్దాం: డివైఎఫ్ఐ మండల నాయకులు రత్నమయ్య, సుందరయ్య పిలుపు

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల, సెప్టెంబర్ 28: ప్రజావాణి  దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్ ఆశయాల స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చే వరకు రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోరుమామిళ్ల మండల అధ్యక్ష, కార్యదర్శులు రత్నమయ్య, సుందరయ్య పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 119వ జయంతిని పురస్కరించుకుని సోమవారం పోరుమామిళ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో రత్నమయ్య, సుందరయ్యలు మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగ సమస్యతో దేశం, రాష్ట్రంలోని యువత కొట్టుమిట్టాడుతుంటే పాలకులు మాత్రం ఇచ్చిన మాట తప్పి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

కడప ఉక్కుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం:

రాష్ట్ర విభజన చట్టంలోని హామీలలో అత్యంత కీలకమైన కడప ఉక్కు కర్మాగార నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వారు తీవ్రంగా తప్పుపట్టారు. కడప ఉక్కును నిర్మిస్తామని నమ్మబలికిన కేంద్రం, గడిచిన అనేక పార్లమెంటు సమావేశాలలో ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడం రాయలసీమ నిరుద్యోగ యువతను వంచించడమేనని విమర్శించారు. అంతకంటే దారుణంగా, జిల్లాకు తలమానికమైన ఉక్కు కర్మాగారం సాధన కోసం రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటులో కనీసం నోరు మెదపకపోవడం, నిలదీయకపోవడం సిగ్గుచేటని ఆక్షేపించారు.

కూటమి ప్రభుత్వం హామీలు ఏవి?:

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై కూడా వారు నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని, ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ హామీల అమలుకు సంబంధించి ఎలాంటి అతీగతీ లేకపోవడం యువతను నిరాశకు గురిచేస్తోందన్నారు. కేవలం ఓట్ల కోసమే హామీలు ఇచ్చి, అధికార పీఠం ఎక్కాక నిరుద్యోగులను నట్టేట ముంచడం పాలకులకు పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.భగత్ సింగ్ లాంటి మహనీయుల పోరాట పటిమను ఆదర్శంగా తీసుకుని, యువత తమ హక్కుల సాధన కోసం వీధుల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని వారు పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని పాలకులు నెరవేర్చేలా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ నివాళుల కార్యక్రమం, నిరసనలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్  మండల కార్యదర్శి ప్రకాశం, డివైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు బాలు, మహేష్‌లతో పాటు పలువురు యువకులు, నిరుద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగత్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.