📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవదంతులను నమ్మవద్దు.. విద్యార్థుల్లో ఎలుకలు కరిచిన ఆనవాళ్లు లేవు : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్...

వదంతులను నమ్మవద్దు.. విద్యార్థుల్లో ఎలుకలు కరిచిన ఆనవాళ్లు లేవు : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

📰 Generate e-Paper Clip

*వదంతులను నమ్మవద్దు.. విద్యార్థుల్లో ఎలుకలు కరిచిన ఆనవాళ్లు లేవు : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*

*విద్యార్థుల ఆరోగ్యంపై క్షుణ్ణంగా ఆరా తీసిన కలెక్టర్*

*పాఠశాలలో పరిశుభ్రత, పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించాలి*

*అనుమతి లేకుండా బయటి వ్యక్తులను పాఠశాలలోకి రానివ్వొద్దు*

*పాలకుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 28(ప్రజావాణి)
సోమవారం, జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్ ప్రకాష్ తో కలిసి కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి, ఈ నెల 22న విద్యార్థులను ఎలుకలు కరిచినట్లు వచ్చిన సమాచారంపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులను ఉద్దేశించి భోజనం ఎలా ఉంది? ఆరోగ్యం ఎలా ఉంది? రాత్రి సమయంలో జ్వరం వస్తుందా? ఎలుకలు కరిచినట్లు మీరు వాటిని చూసారా? మీ పేరు ఏమిటి? మీ అమ్మానాన్న పేర్లు? వారు ఏం చేస్తారు? ఏ ఊరు? టీకాలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. అలాగే విద్యార్థుల కాళ్లు, చేతులను నిశితంగా పరిశీలిస్తూ, ఏ సమయంలో జరిగింది? ఆ సమయంలో రక్తం వచ్చినట్లు అనిపించిందా? నొప్పిగా ఏమైనా ఉందా? అని వివరాలు తెలుసుకున్నారు.

దీనిపై స్పందించిన విద్యార్థులు.. తమకు జ్వరం లేదని, రక్తం కూడా రాలేదని, భోజనం మంచిగా ఉందని, ఆరోగ్యం బాగుందని కలెక్టర్ కు వివరించారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వదంతులను నమ్మవద్దని పేర్కొన్నారు. విద్యార్థులను పరిశీలించిన అనంతరం ఎలుకలు కరిచిన ఆనవాళ్లు ఏవీ లేవని, వారి చేతులు, కాళ్లపై ఎటువంటి గీతలు కూడా కనిపించలేదని తెలిపారు.

అనంతరం పాఠశాలలోని భోజన గది, సరుకుల నిల్వ గది, వంటశాల, మరుగుదొడ్లు, మూత్రశాలలు, తదితర ప్రాంతాలను కలియతిరిగి విస్తృతంగా పరిశీలించారు. విద్యార్థుల మంచాలను కూడా తనిఖీ చేశారు.

పాఠశాల పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, పరిశుభ్రత విషయంలో పంచాయతీ కార్యదర్శిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, పనికిరాని వస్తువులను వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డికి ఆదేశించారు.

విద్యార్థులకు నాణ్యమైన, శుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించాలని, నిల్వ లేకుండా తాజా కూరగాయలతో ఆహారం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అదే విధంగా అనుమతి లేకుండా బయటి వ్యక్తులను పాఠశాల లోపలికి రానివ్వకూడదని స్పష్టం చేశారు.

ఎంపిడిఓ, తహసీల్దార్ లు పాఠశాలలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థులు సయానుగుణంగా ఆహరం తీసుకోవాలని, బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ప్రోత్సహించారు.

ఈ పర్యవేక్షణలో తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీఓ వేదవతి, వైస్ ప్రిన్సిపల్ వరలక్ష్మి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.