మాదకద్రవ్యాలకు నో చెప్పండి.. మెరుగైన జీవితాన్ని ఎంచుకోండి
నశా ముక్త్ యువ క్యాంపెయిన్‌తో విద్యార్థులకు అవగాహన
బెజ్జంకి, సెప్టెంబర్ 28 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పీఎంశ్రీ టీజీ మోడల్ స్కూల్,జూనియర్ కాలేజీ లో నశా ముక్త్ యువ క్యాంపెయిన్, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఖలీదా శిరీన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగాయి.
నశా ముక్త్ యువ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యం, విద్య, కుటుంబ జీవితం, సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించారు. విద్యార్థులు పోస్టర్లు, ప్లకార్డులు, చిత్రాల ద్వారా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించారు.ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి అందాలపై విద్యార్థులు చిత్రాలు, పోస్టర్లు, ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పర్యాటక ప్రాధాన్యతతో పాటు వారసత్వం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పొందారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జే. శ్రీనివాస్, కే. శ్రీనివాస్, బాలరాజు, రమేష్, కవిత, లక్ష్మి, శారద, చంటి బాబు, సర్వేష్, సంజీవ్, చక్రధర్, వెంకటేష్, రాజ్యలక్ష్మి, స్వరూప, రమ్య, నజియా తదితరులు పాల్గొన్నారు.

